విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
- కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని(Kasturba Gandhi Girls School) సందర్శించి పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగది, భోజనశాల పరిశీలించి, విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం తో పాటు నాణ్యమైన విద్యా బోధన అందించాలని తెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎం.పి.సి. విద్యార్థినులకు గణితంలో అందిస్తున్న బోధన, వారి అభ్యసన స్థాయిని పరిశీలించి పలు సూచనలు చేశారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, అధికారులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాలలో ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని, ఆక్రమణలు గుర్తించినట్లయితే వెంటనే స్పందించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.