అవయవదాననికి అంగీకారం
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన ఏనుగుందుల రవి గౌడ్ (55) ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 19వ తేదీన అకస్మాత్తుగా బిపి పెరగడంతో మెదడులో రక్తం గడ్డకట్టి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు.ఈ క్రమంలో రవి గౌడ్ కుమారుడు శశికుమార్ అంగీకారంతో తండ్రి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో రవి గౌడ్ కిడ్నీ, గుండెను అక్కడి ప్రభుత్వానికి దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన తండ్రి మరణంలోనూ ఇతరులకు ప్రాణదానం చేయాలనే నిర్ణయం తీసుకోవడం పలువురి ప్రశంసలు అందుకుంది. అనంతరం రవి గౌడ్ మృతదేహాన్ని గురువారం స్వగ్రామమైన మొగిలిపేటకు తీసుకురాగా కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.