పొగమంచులో ప్రమాదాల నివారణకు ప్రత్యేక తనిఖీలు
220 వాహనాల తనిఖీ.. రూ.1.20 లక్షల జరిమానా
మంచిర్యాల క్రైమ్, ( విజయక్రాంతి) : చలికాలంలో పొగమంచు కారణంగా రహదారి ప్రమాదాలు(Road Accidents) జరగకుండా వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల(Traffic rule) అమలుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Police Commissioner Amber Kishore Jha) ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్(Traffic ACP Srinivas) ఆధ్వర్యంలో మంచిర్యాల పరిధిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
మంచిర్యాల, శ్రీరాంపూర్, సీసీ నస్పూర్, కేతనపల్లి, మంచిర్యాల బైపాస్ రోడ్డు, గద్దెరగడి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. రాంగ్ పార్కింగ్ చేసిన లారీలు, ఇతర భారీ వాహనాలతో పాటు మొత్తం 220కి పైగా వాహనాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకుని రూ.1.20 లక్షల జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ... చలికాలంలో పొగమంచు కారణంగా రహదారిపై దృశ్యమానత తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశముందని తెలిపారు. వాహనాలకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఏర్పాటు చేసుకోవాలని, హెడ్లైట్లు, టెయిల్ లైట్లు, ఇండికేటర్లు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు నెమ్మదిగా ప్రయాణించాలని, ముందు వెళ్లే వాహనానికి తగినంత దూరం పాటించాలని, అతివేగాన్ని నివారించాలని పేర్కొన్నారు.
భారీ వాహనాల డ్రైవర్లు రహదారులపై నిర్లక్ష్యంగా వాహనాలు నిలపకూడదని సూచించారు. వాహనాలు మరమ్మతులకు గురైనప్పుడు ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు.
ప్రమాదాల నివారణకు ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ తనిఖీల్లో రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హనన్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.