ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్, డిజిటల్ గవర్నెన్స్‌పై పూర్తి అవగాహన
- అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్(IFMIS portal), డిజిటల్ గవర్నెన్స్(Digital Governance)పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు తెలిపారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో హెచ్ఓఓలు, డీడీఓలు, మండల స్థాయి అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్‌పాండేతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యతనిస్తూ ఐఎఫ్ఎంఐఎస్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తుందని తెలిపారు.
ఆగస్టు 15వ తేదీ నుంచి ఐ.ఎఫ్.ఎం.ఐ.ఎస్. పోర్టల్ ద్వారా అన్ని బిల్లుల సమర్పణ డిజిటల్ విధానంలో కొనసాగుతుందని, 2027 జనవరి 1వ తేదీ నుంచి మాన్యువల్ విధానానికి పూర్తిగా స్వస్తి పలికి, ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటల్ విధానంలోనే నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీలోగా ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లలో చేయవలసిన అన్ని వివరాల నమోదు, అప్డేషన్లను పూర్తి చేయాలని సూచించారు. జనవరి 1వ తేదీ నుంచి ఎంప్లాయీ సర్వీస్ రిజిస్టర్ పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందని తెలిపారు.
నూతన డిజిటల్ విధానాలపై ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పూర్తి అవగాహన కలిగి ఉండాలని, శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. శిక్షణలో భాగంగా ఈ.ఎస్.ఆర్. లో ఉద్యోగుల వివరాల నమోదు, నియామకాలు, పోస్టింగులు, సెలవుల దరఖాస్తు, సెలవుల రద్దు తదితర అంశాలను ప్రాక్టికల్‌గా వివరించారు. ఈ ఆర్ ఎస్ లో ఒకసారి నమోదు చేసిన వివరాలను తిరిగి ఎడిట్ / డిలీట్ చేసే అవకాశం లేనందున, వివరాల నమోదు, ఆమోదం సమయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సందేహాలను శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.