ప్రభుత్వ భూమి ప్రైవేటుకు కట్టబెట్టేందుకు యత్నం

11-11-2026 | 07:56pm

మేడ్చల్, నవంబర్ 11 (విజయక్రాంతి): అల్వాల్(Alwal)లోని 385 సర్వే నెంబర్ లో 2.35 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబట్టేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నం చేస్తున్నారని గ్రీన్ ఫీల్డ్ ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. బుధవారం కలెక్టరేట్ సమీపంలోని జిల్లా ప్రెస్ క్లబ్ లో అసోసియేషన్ కార్యదర్శి కే శ్రీనివాసరెడ్డి, విశ్వనాథం, అశోక్, సుధాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ కాలనీలోని ప్రభుత్వ భూమిపై ప్రైవేటు వ్యక్తుల కన్ను పడిందన్నారు.

ఆ భూమిని వారికి కట్టబెట్టడానికి రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ భూమికి సంబంధించి ఇద్దరు వ్యక్తులకు రెవెన్యూ అధికారులు అక్రమంగా 2023లో పట్టా పాస్ బుక్ లు జారీ చేశారని వారు పేర్కొన్నారు. దీనిపై పాము హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు పాసుబుక్కులను రద్దు చేసిందని తెలిపారు. హైకోర్టు పాసుబుక్కులు రద్దు చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు ఇంప్లిమెంటేషన్ చేయడం లేదని తెలిపారు. ఈ భూమిపై తహసిల్దార్ వద్ద శనివారం జరిగే విచారణకు జిపి హోల్డర్ ను ఆహ్వానించి, కోర్టుకు వెళ్లిన తమనెందుకు ఆహ్వానించడం లేదని వారు ప్రశ్నించారు.

రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ భూమి విషయములో రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రైవేటుకు అప్పగించడానికి సహకరిస్తున్నట్లు స్పష్టం అవుతుందన్నారు. 2.35 ఎకరాల భూమిలో ఇద్దరూ ఫ్లాట్ల యజమానులు ఇల్లు నిర్మించుకోగా, ఈ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చూయించి, ఇరువైపులా ఇద్దరు వ్యక్తులకు పాసుబుక్కులు జారీ చేయడం విచిత్రంగా ఉందన్నారు. గతంలో ఈ భూమి లేవుటైనందున అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి న్యాయం చేయాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు