వెంటాడుతున్న ఎల్‌నినో భయం

15-10-2026 | 05:05am
  1. బియ్యం ధరలకు రెక్కలు 
  2. నిత్యావసర సరుకులదీ అదేదారి 
  3. కాలనీల్లో నీటి కష్టాలు

మేడ్చల్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఎల్ నినో భయాలు(El Nino Fears) ప్రజలను వెంటాడుతున్నాయి. ఇప్పటికే దీని ప్రభావం ప్రజలపై స్పష్టంగా కనిపిస్తుండగా, భవిష్యత్తులో మరిన్ని కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు కురువక నీటి కొరత ఏర్పడింది. ఆహార ఉత్పత్తుల ధరలను(Price of food products) కూడా తీవ్ర ప్రభావితం చేస్తోంది. నెల రోజుల్లో బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. సన్న రకం బియ్యం(Fine-grain rice) కిలోకు రూ. 15 నుంచి రూ.20 వరకు పెరిగాయి.

నెల రోజుల క్రితం సన్న రకం బియ్యం కిలోకు రూ. 61 ఉండగా, ప్రస్తుతం రూ. 77కు చేరింది. బియ్యం ధరల పెరుగుదల వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. తక్కువ సమయంలో 25% వరకు ధరలు పెరగడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో(Ration shop) సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన తొలినాళ్లలో బియ్యం ధరలు స్థిరంగా ఉన్నాయి. సన్న బియ్యం పంపిణీ చేసినప్పటికీ చాలామంది ఆ బియ్యం తినడం లేదు. వాటిని విక్రయించి బయట మార్కెట్లో మేలైన సన్న బియ్యం కొనుగోలు చేస్తున్నారు.

వానా కాలం పంట చేతికి వచ్చింది. కొన్ని జిల్లాలలో ఇతర రాష్ట్రాల వారు కల్లాల మీదనే అధిక ధర చెల్లించి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ధాన్యం క్వింటాకు రూ. 3,500 పైన చెల్లిస్తున్నారు. ధాన్యం ధర ప్రభావం బియ్యం ధరలపై ఉంటుందని మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో వరి పంట వేయొద్దని ఆరు తడి పంటలు వేయాలని ప్రభుత్వం ముమ్మర ప్రచారం చేస్తోంది.

చెరువులు, ప్రాజెక్టులలో నీరు లేదు. బోరు బావుల కింద కూడా సాగునీరు అందే అవకాశం లేదు. దీనికి తోడు కరెంటు సమస్య కూడా ఎదురు కానుంది. వానాకాలంలోనే కరెంటు కోతతో రైతులు పంటలకు నిరంధించలేకపోయారు. యాసంగిలో మరింత సమస్య ఎదురు కానుంది. దీంతో రైతులు కూడా వరి పంటకు బదులు ఇతర పంటలు వేసే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో బియ్యం ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు. 

అక్రమ నిలువలు 

బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉండడంతో కొందరు వ్యాపారులు అక్రమ నిలువలు చేసుకుంటున్నారు. వ్యాపారులే బియ్యం ధరలు పెంచుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ నిల్వలు చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అంటున్నారు. గోదాములపై అధికారులు దాడులు జరిపి అక్రమ నిలువలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

పెరిగిన ఉల్లి ధరలు 

ఉల్లి ధరలు కూడా బాగా పెరిగాయి. కిలోకు రూ 60 నుంచి రూ 70  వరకు విక్రయిస్తున్నారు. కొత్త పంట వస్తుండడంతో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇతర నిత్యవసర సరుకుల ధరలు కూడా బాగా పెరిగాయి. 

అప్పట్లో యుద్ధం... నేడు ఎల్‌నినో 

ఫిబ్రవరి, మార్చి నెలలో యుద్ధం సాకుతో వ్యాపారులు అన్ని ధరలు పెంచేశారు. గ్యాస్ దొరకడం లేదని హోటళ్లలో భోజనం, టిఫిన్, టీ ధరలు పెరిగాయి. గ్యాస్ విరివిగా లభిస్తున్నప్పటికీ ధరలు మాత్రం దిగి రాలేదు. ప్రస్తుతం ఎల్ నినోవల్ల నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. 

నీటి కటకట 

ఎల్‌నినో వల్ల వర్షాలు సమృద్ధిగా కురువక భూగర్భ జలాలు పెరగలేదు. మేడ్చల్ జిల్లాలో వర్షాకాలంలోనే తీవ్ర నీటి ఎద్దడి ఉంది. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీరు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ కు రూ.600 నుంచి రూ. వెయ్యి వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ట్యాంకర్లకు బాగా డిమాండ్ ఏర్పడింది. మరో 8, 9 నెలలు ఎలా గడుస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు