‘సౌకర్యం’.. శూన్యం..!

17-11-2026 | 05:15am

 ఘట్‌కేసర్ బైపాస్ బస్టాండ్‌లో కనీస వసతులు కరువు

దుమ్ముధూళి, చీకటితో ప్రయాణికుల అవస్థలు

ఘట్కేసర్, నవంబర్ 16 (విజయక్రాంతి) : హైదరాబాద్- జాతీయ రహదారిపై(Hyderabad - National Highway) కీలక జంక్షన్గా ఉన్న ఘట్కేసర్ బైపాస్ రోడ్డు బస్టాండ్(Ghatkesar Bypass Bus Stand) ప్రయాణికులకు తీవ్ర నరకాన్ని చూపుతోంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు(Passengers), వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ బస్టాండ్ ప్రాంగణంలో కనీస వసతులు లేక ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బైపాస్ రోడ్డు మార్గంలో నిరంతరం ప్రయాణించే భారీ వాహనాలు, బస్సుల తాకిడికి విపరీతమైన దుమ్ము, ధూళి(Dust and dirt) రేగుతోంది. సరైన కవర్ లేదా షెల్టర్ సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి దుమ్ములో నిలబడాల్సి వస్తోంది. ఈ ధూళి కారణంగా ప్రయాణికులతో పాటు స్థానిక వ్యాపారులు, వాహనదారులు శ్వాసకోశ సంబంధిత సమస్యలు, కళ్ల కలకలకు గురవుతున్నారు. రోడ్డుపై కనీసం నీటిని చల్లకపోవడంతో నిమిషానికోసారి ధూళి మేఘాలు కమ్ముకుంటున్నాయి.

చీకటిలో బైపాస్ రోడ్డు.. రాత్రి వేళల్లో భయాందోళనలు!

రాత్రి వేళల్లో ఈ బస్టాండ్ పరిస్థితి మరింత ఘోరంగా మారుతోంది. బైపాస్ బస్టాండ్ పరిసరాల్లో సరైన లైటింగ్ (స్ట్రీట్ లైట్స్) లేకపోవడంతో ప్రయాణికులు చీకట్లోనే బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. రాత్రి సమయాల్లో వెలుతురు లేకపోవడం వల్ల మహిళలు, వృద్ధులు భయాందోళన చెందుతున్నారు. ఆకతాయిల ముఠాలు, పోకిరీల సంచారంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో అత్యంత కీలకమైన స్టాప్గా ఉన్నప్పటికీ ప్రయాణికులకు కావలసిన మౌలిక వసతులు మచ్చుకైనా కనిపించడం లేదు.దాహార్తి తీర్చుకోవడానికి కనీసం మంచి నీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లు లేక మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు వచ్చే వరకు వేచి ఉండేందుకు సరైన బెంచీలు లేదా బస్ షెల్టర్లు లేవు. 

అధికారుల అలసత్వంపై ప్రజా ఆగ్రహం..

రోజూ వేలాది మంది ప్రయాణించే ప్రధాన బైపాస్ బస్టా్ంప అధికారులు,  ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించడం తగదని, పన్నులు వసూలు చేయడంలో చూపించే శ్రద్ధ ప్రయాణికుల కనీస సౌకర్యాల కల్పనలో చూపడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత పురపాలక, ఆర్టీసీ, జాతీయ రహదారుల అధికారులు తక్షణమే స్పందించి బైపాస్ బస్టాండ్ వద్ద హైమాస్ట్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, బస్ షెల్టర్ వద్ద తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకురావాలని,  ధూళి నివారణకు క్రమం తప్పకుండా సర్వీస్ రోడ్ల వద్ద నీరు చల్లే ఏర్పాటు చేయాలని ప్రయాణికులు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు