ఆత్మగౌరవంతో జీవిస్తున్నామంటే అందుకు కారణం బి.ఆర్. అంబేడ్కర్
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశపావుల వినోద్
ఘట్ కేసర్, నవంబర్ 15 (విజయక్రాంతి): ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 292వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం ఘట్ కేసర్ పట్టణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఘట్ కేసర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశపావుల వినోద్(Youth Congress President Keshavapula Vinod) విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ నేడు మనమంతా విద్యను అభ్యసిస్తున్నా, సమానత్వం, స్వేచ్ఛ, హక్కులు, ఆత్మగౌరవంతో జీవిస్తున్నామంటే అందుకు ప్రధాన కారణం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అని తెలియజేశారు. తన జీవితాన్ని సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేసి, ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి, దేశ ప్రజలందరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం అనే గొప్ప విలువలను అందించారని తెలియజేశారు.
అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలు భవిష్యత్తు తరాలకు చేరవేయడం మనందరి బాధ్యత అని, సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని తెలియజేశారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్య పరుస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె. నర్సింగ్ రావు, కె.సత్యం, గంగారం అంజయ్య, కె. యుగేందర్ ప్రసాద్, జి. కృష్ణ, ఎం. బాలకృష్ణ, పి. మహేష్, ఎం. దిలీప్, సి. నిఖిల్, ఈ. విష్ణు, శివ తదితరులు పాల్గొన్నారు.