సర్వే చేయరు.. ‘హద్దులు’ చూపరు!

20-11-2026 | 05:00am
  1. ప్రభుత్వ భూమి వెలికితీయడంలో రెవెన్యూ అధికారుల తాత్సారం 
  2. మేడ్చల్ పట్టణంలో రూ.కోట్ల విలువైన భూమి మాయం 
  3. కబ్జా అయిందని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన కులసంఘాల ప్రతినిధులు  
  4. స్పందించని అధికారులు 

మేడ్చల్, నవంబర్ 19 (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో రూ. కోట్ల విలువైన భూమి కబ్జా(Land Encroachment) అయిందని, దీనిని వెలికి తీయాలని వివిధ కుల సంఘాల నాయకులు రెవెన్యూ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించినప్పటికీ అధికారులు స్పందించడం లేదు. పట్టణంలో నడిబొడ్డున బస్ డిపో ఎదురుగా గల్లీలో 67 సర్వే నంబర్‌లో రూ. అయిదారు కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైందని కుల సంఘాల ప్రతినిధులు వారం క్రితం ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై అధికారులు ఇప్పటివరకు విచారణ చేపట్టలేదు. 67 సర్వే నంబర్ లో 2.24 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 2.02 ఎకరాలు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మంటపానికి కేటాయించారు. మిగతా 22 గంటల భూమి ఆక్రమణకు గురైంది. ఈ భూమిని వెలికితీయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో కొంత భూమి డబిల్పూర్ కు చెందిన రాజ మల్లారెడ్డి ఆధీనంలో ఉందని ఆరోపిస్తున్నారు. 63 సర్వే నెంబర్ పక్కన 45, 46, 47 సర్వే నంబ ర్లు ఉన్నాయి. ఈ సర్వే నంబర్లలో వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించారు. వినాయక్ నగర్ రోడ్ నెంబర్ 2 ఈ వెంచర్ పరిధిలోనే ఉంది. 

ఏడుగుళ్ల దేవాలయం నిర్మించడానికి సన్నాహాలు..

మేడ్చల్ పట్టణంలో 44 నెంబరు జాతీ య రహదారిని ఆనుకుని ఏడుగుళ్ల దేవాల యం ఉంది. ప్రస్తుతం పట్టణంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దీంతో రోడ్డు వెడల్పు చేస్తున్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా దేవాలయాన్ని కూల్చివేయనున్నారు. ఇదివరకే నోటీసు కూడా ఇచ్చారు. ప్రత్యామ్నాయంగా మరోచో ట దేవాలయాన్ని నిర్మించడానికి స్థలం అన్వేషిస్తున్న సమయం లో ఈ స్థలం ప్రస్తావనకు వచ్చింది. రాజమల్లారెడ్డి ఆధీనంలో ఉన్న సుమారు 250 గజాల స్థలం ప్రభుత్వానిదేనిని కులసంఘాల వారు వాదిస్తున్నారు.

సర్వే చేస్తేనే తేలనున్న ప్రభుత్వ భూమి 

రాజ మల్లారెడ్డి ఆధీనంలో ఉన్న భూమి తన దేనని ఆయన వాదిస్తున్నారు. సర్వే చేస్తే మొత్తం భూమి బయటపడుతుంది. 45, 46, 47 సర్వేనెంబర్లలో వెంచర్ వేసిన సమయంలో కొంత భూమి అందులో కలిసిందని, వెంచర్ నిర్వాహకులు 2 ప్లాట్లు విక్రయించలేదని, ఆ ప్లాట్లను కొందరు తమ పేరట మార్చుకున్నారని స్థానికులు అంటున్నారు. అధికారులు సర్వే చేస్తే ప్రభుత్వ భూమి ఎక్కడుందో తేలుతుంది. చేయడంలో జాప్యం చేస్తే ప్రజల నుంచి నిరస న వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. 

సర్వే చేయడంలో జాప్యం.. 

తాము ప్రభుత్వ భూమి కబ్జా అ యిందని తహసిల్దార్ కార్యాలయం లో ఫిర్యాదు చేసాం, సర్వే చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. వెంటనే సర్వే చేసి ప్రభుత్వ భూమిని వెలికి తీయాలి.

 చెరుకొమ్ము శ్రీనివాస్ గౌడ్ 

ఆ స్థలానికి సంబంధించి డాక్యుమెంట్ ఉంది.. 

తన ఆధీనంలో ఉన్న స్థలానికి సంబంధించి డాక్యుమెంట్ ఉందని డబిల్పూర్‌కు చెందిన రాజమల్లారెడ్డి తెలిపారు. తాను అచ్చవెల్లికి చెందిన నందారెడ్డి వద్ద  కొనుగోలు చేశానని, మున్సిపాలిటీలో పన్ను కూడా కడుతున్నానని తెలిపారు. తన భూమి కొంత వదిలేశానని తెలిపారు.

రాజమల్లారెడ్డి 

మరిన్ని వార్తలు