మెగాస్టార్ షోకు కోలీవుడ్ జంట

17-11-2026 | 03:38pm

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఓటీటీ ఎంట్రీతో సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘చిరంజీవీస్ మెగావర్స్’ టాక్ షో(Chiranjeevi Megaverse Talk Show) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం షూటింగ్ ప్రారంభం కాగా, తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ఆయన సతీమణి, నటి జ్యోతిక ఈ షోలో అతిథులుగా పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సూర్య, జ్యోతిక(Suriya, Jyothika) జంట కోసం ప్రత్యేక ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై నెట్‌ఫ్లిక్స్ సంస్థ కానీ, చిరంజీవి బృందం కానీ, సూర్య దంపతులు కానీ అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ వార్తపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే చిరంజీవి, సూర్య, జ్యోతిక ఒకే వేదికపై కనిపించడం ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. వీరి సినీ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలు, కుటుంబ జీవితం, చిత్ర పరిశ్రమలో ఎదురైన ఆసక్తికర సంఘటనలపై సంభాషణలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్య, జ్యోతిక జంటకు ఉన్న ప్రత్యేకమైన క్రేజ్ ఈ ఎపిసోడ్‌పై అంచనాలను పెంచుతోంది.

చిరంజీవి తన సుదీర్ఘ సినీ ప్రయాణంలోని అనుభవాలను, సినీ ప్రముఖులతో తనకున్న అనుబంధాలను ఈ కార్యక్రమం ద్వారా పంచుకోనున్నారు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ‘చిరంజీవీస్ మెగావర్స్’ను అధికారికంగా ప్రకటించింది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పీ ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తున్నాయి. షో ప్రసార తేదీ, అతిథుల పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది. మొత్తానికి సూర్య–జ్యోతిక ఎపిసోడ్‌పై వస్తున్న వార్త నిజమవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు