చేయూత పింఛన్లు మంజూరు
లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
నాగల్గిద్ద, నవంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana State) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పథకంలో(Cheyutha Pension Scheme) భాగంగా నాగల్గిద్ద మండలానికి మంజూరైన 339 పింఛన్ల మంజూరు పత్రాలను మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి(MLA Dr. Patlolla Sanjeeva Reddy) లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాకు రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో చేయూత పింఛన్లు మంజూరు కావడం, నారాయణఖేడ్ నియోజకవర్గానికి జిల్లాలో అత్యధిక పింఛన్లు రావడం సంతోషకరమన్నారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.
గతంలో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఈ పింఛన్లు ఆర్థికంగా ఎంతో చేయూతనిస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వివరించారు. ఇరాక్పల్లి గ్రామానికి నూతన విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు.
నాగల్గిద్ద మండలాన్ని విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, రహదారుల రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో శంకర్, నారాయణ ఖేడ్ ప్రత్యేక అధికారి శివప్రసాద్, ఆత్మ కమిటీ చైర్మన్ వినోద్ పటేల్,
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విట్టల్ రావు పాటిల్, యువజన అధ్యక్షుడు సచిన్ పాటిల్, నారాయణ ఖేడ్ ఏడీఏ ప్రవీణ్ చారి, మండల విద్యాధికారి మన్మధ కిషోర్, స్థానిక సర్పంచ్ లక్ష్మి లక్ష్మణ్, మండల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.