నేడు ఐపీఎల్ రిటెన్షన్ ప్రకటన.. అభిమానుల్లో ఉత్కంఠ

17-11-2026 | 03:00pm

 కమిన్స్, హెడ్‌లపై SRH నిర్ణయమేంటి?

స్పోర్ట్స్ డెస్క్,(విజయక్రాంతి): ఐపీఎల్ 2027 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. పది ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాలను మంగళవారం బీసీసీఐకి సమర్పించనున్నాయి. దీంతో ఏ జట్టు ఎవరిని కొనసాగిస్తుంది? ఎవరికి గుడ్‌బై చెబుతుంది? అనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.

ఐపీఎల్ 2027 రిటెన్షన్ ప్రత్యేక కార్యక్రమం సాయంత్రం 5:40 గంటల నుంచి జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోనూ టెలికాస్ట్ వివరాలు అందుబాటులో ఉన్నాయి. అభిమానులు తమ అభిమాన జట్లలో కొనసాగే ఆటగాళ్లు, వేలంలోకి వెళ్లే ఆటగాళ్ల వివరాలను తెలుసుకోవచ్చు.

ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ నిర్ణయాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ల భవితవ్యం చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్, ఆటగాళ్ల అందుబాటు అంశాలు ఎస్ఆర్‌హెచ్ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ముఖ్యంగా ట్రావిస్ హెడ్ పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ 2027కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అతడిని జట్టు నుంచి విడుదల చేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది. మరోవైపు కమిన్స్ అందుబాటుపైనా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ ఇద్దరు ఆటగాళ్ల విషయంలో హైదరాబాద్ ఫ్రాంచైజీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

డిసెంబర్ 16న మినీ వేలం

ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో నిర్వహించనున్నట్లు సమాచారం. రిటెన్షన్ జాబితాలు వెల్లడైన తర్వాత ఏ జట్టు దగ్గర ఎంత పర్స్ మిగులుతుంది? వేలంలో ఎవరిని కొనుగోలు చేయాలని భావిస్తోంది? అనే అంశాలపై స్పష్టత రానుంది. రిటెన్షన్ ప్రకటనతో ఐపీఎల్ సందడి మరోసారి మొదలుకానుంది.

మరిన్ని వార్తలు