పేద కుటుంబాలకు రూ.10 లక్షల భరోసా కల్పించాలి.!
- ఇందిరమ్మ కుటుంబ బీమా పరిహారం పెంచాలి.. ఆరోగ్యశ్రీలో అన్ని వ్యాధులకు ఉచిత వైద్యం అందించాలి
- ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ఏర్పాటు అభినందనీయం
- రూ.5 లక్షల పరిహారం సరిపోదు.. రూ.10 లక్షలకు పెంచాలి
- వైద్య ఖర్చులతో పేదలు అప్పులపాలు.. ప్రాణాలు కోల్పోతున్న వైనం
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టిపల్లి సైదులు డిమాండ్
మోతె, నవంబర్ 17 (విజయ క్రాంతి): పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా(Financial Security) కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం(Indiramma Family Insurance Scheme) అభినందనీయమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రూ.5 లక్షల పరిహారం సరిపోదని, దానిని రూ.10 లక్షలకు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు.
మంగళవారం మోతే మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే పిల్లల చదువులు, కుటుంబ పోషణ, అప్పుల భారం తీరని సమస్యలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే పరిహారం ఆ కుటుంబం తిరిగి నిలదొక్కుకునేలా ఉండాలని, అందుకే రూ.10 లక్షలకు పెంచాలని కోరారు.
పేదల ప్రాణాలకు విలువ లేదా.?
ఆరోగ్యశ్రీ పథకంలో అన్ని రకాల వ్యాధులకు ఉచిత వైద్యం అందించాలని సైదులు డిమాండ్ చేశారు. అనారోగ్యం బారినపడితే పేదలు అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకుని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వైద్య ఖర్చులు భరించలేక కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని, మరికొందరికి సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధుల పరిమితులు,
వైద్య ప్యాకేజీల పేరుతో పేదలకు చికిత్స నిరాకరించకుండా అన్ని రకాల వ్యాధులు, శస్త్రచికిత్సలకు పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్యం అందించాలని కోరారు. సంక్షేమ పథకాలు ప్రకటనలకే పరిమితం కాకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి వాటి ఫలాలు అందించాలని, ఆరోగ్యశ్రీని విస్తరించడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మట్టిపల్లి సైదులు కోరారు.