జైస్వాల్‌పై కన్నేసిన ఫ్రాంచైజీలు

17-11-2026 | 03:19pm

స్పోర్ట్స్ డెస్క్ (విజయక్రాంతి): ఐపీఎల్ 2027 సీజన్‌(IPL 2027 season)కు ముందే ఆటగాళ్ల బదిలీల వ్యవహారం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతోంది. అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ఆసక్తి చూపుతున్నట్లు క్రీడా కథనాలు వెల్లడిస్తున్నాయి.

తమ జట్టుకు కొత్త కెప్టెన్‌తో పాటు బలమైన భారత బ్యాటర్ అవసరమైన నేపథ్యంలో కోల్‌కతా జైస్వాల్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కూడా అతడిని జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఫ్రాంచైజీలు జైస్వాల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని కథనాల్లో కోల్‌కతా ముందంజలో ఉందని, మరికొన్ని కథనాల్లో లక్నోకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. అయితే ఈ బదిలీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

నవంబర్ 17తో ఐపీఎల్ 2027 రిటెన్షన్ జాబితాల(IPL 2027 Retention List) సమర్పణ గడువు ముగియనుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం జైస్వాల్‌ను కొనసాగిస్తుందా? ఇతర జట్టుకు ట్రేడ్ చేస్తుందా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఒకవేళ ట్రేడింగ్ ఒప్పందం కుదరకపోతే రాజస్థాన్ జైస్వాల్‌ను రిటైన్ చేయడం లేదా విడుదల చేయడంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న మినీ వేలానికి ముందే ఈ యువ సంచలనం భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జైస్వాల్ ఏ జెర్సీతో బరిలోకి దిగుతాడో తెలుసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు