పిల్లల అభిప్రాయాలను గౌరవిద్దాం

16-11-2026 | 05:34pm
  1. నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్
  2. జిల్లావ్యాప్తంగా పిల్లల ప్రజావాణికి 32 దరఖాస్తులు
  3. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు, నవంబర్ 16 (విజయక్రాంతి): బాలల హక్కుల పరిరక్షణ(Protection of Children's Rights), పిల్లల సమస్యల పరిష్కారంతో పాటు వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో ములుగు జిల్లాలో ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి కార్యక్రమాన్ని(Children's public service program) నిర్వహించారు.

సోమవారం ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో బాలల దినోత్సవం, బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూనిసెఫ్ భాగస్వామ్యంతో ‘‘నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్’’ అనే నినాదంతో నిర్వహించిన పిల్లల ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులను ఆహ్వానించి, ప్రజావాణి కార్యక్రమం నిర్వహించే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. జిల్లా కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు చదువుతున్న పాఠశాలల్లో, నివసిస్తున్న ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభిప్రాయాలను శ్రద్ధగా విని, వారు సమర్పించిన వినతిపత్రాలను పరిశీలించారు.

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పిల్లల ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 32 దరఖాస్తులు అందాయి. జిల్లాలోని 10 మండలాల్లో నిర్వహించిన పిల్లల ప్రజావాణిలో 22 దరఖాస్తులు, జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక పిల్లల ప్రజావాణిలో 10 దరఖాస్తులు అందాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, ఎం. సంపత్ రావు, జిల్లా సంక్షేమ అధికారిణి ప్రేమలత, డీఎస్పీ కిషోర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి జె. ఓంకార్, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ ఏ. రమాదేవి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు