బిజినేపల్లిలో తాగుబోతుల వీరంగం
బిజినేపల్లి, నవంబర్ 14 (విజయక్రాంతి): మండల కేంద్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతుండటంతో మందుబాబులు మద్యం మత్తులో ప్రధాన రహదారులపై హల్‌చల్ చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మద్యం అందుబాటులో ఉండటంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.
మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో మందుబాబులు వాహనాలను అడ్డుకోవడంతో పాటు రోడ్డుపైనే పడుకుంటున్నారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెల్టు షాపులు, మద్యం దుకాణాల్లో విక్రయాలపై అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలని మహిళలు, స్థానికులు కోరుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.