సబ్సిడీపై ఆరుతడి పంటల విత్తనాలు
బిజినేపల్లి, నవంబర్ 19 (విజయక్రాంతి): యాసంగి (Rabi Season)లో రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలైన పెసర, మినుము, జొన్న, రాగి వంటి పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి (District Agriculture Officer) యశ్వంత్ రావు సూచించారు. ఈ పంటలకు అవసరమైన విత్తనాలు సబ్సిడీ (Subsidy)పై అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
గురువారం మండలంలోని వెల్గొండ గ్రామంలో రైతులకు సుస్థిర వ్యవసాయం, భూసార పరిరక్షణ, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యశ్వంత్ రావు మాట్లాడుతూ.. భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న రైతులు సైతం ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సాగు చేసిన పంటలను గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు.
ఆరుతడి పంటలు సాగు చేసే రైతులు డ్రిప్ సేద్యం, మల్చింగ్, స్ప్రింక్లర్లు, పెండల్స్ వంటి వ్యవసాయ పరికరాలు, సౌకర్యాల కోసం ఏఈఓ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఓ ప్రసాద్ బాబు, సర్పంచ్ నాగిరెడ్డి, ఏఈఓ భార్గవ్ సాగర్, గ్రామ పెద్దలు పులిదండ నాగేష్, ఈర్ల భూపేష్ బాబు, వేమన, పరశురాములు, రైతులు పాల్గొన్నారు