ఢిల్లీ పోలీస్.. షేమ్ షేమ్!

18-10-2026 | 05:20am
  1. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదుట మహిళా సంఘాల ధర్నా
  2. నిరసనల్లో మహిళలను శారీరకంగా వేధించారని ఆరోపణ
  3. ఫొటో, వీడియో ఆధారాలు ఉన్నాయని వెల్లడి
  4. చర్యలు తీసుకోవాలని, అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: పోలీసుల తీరుకు వ్యతిరేకంగా శనివారం ఢిల్లీలో మహిళా సంఘాలు(Women's Groups) పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. పోలీస్ హెడ్‌క్వార్టర్(Police Headquarters0 ఎదుట ప్లకార్డులతో మెరుపు ధర్నా చేపట్టాయి. ‘ఢిల్లీ పోలీస్.. షేమ్ షేమ్’ అంటూ నినాదాలు చేశాయి. జులైలో నీట్ అవకతకలకు వ్యతిరేకంగా, ఇప్పుడు ‘సర్’ అక్రమాలకు వ్యతిరేకంగా దేశరాజధానిలో మహిళలు ఆందోళన చేపడితే.. వారిని కొందరు పోలీసులు శారీరకంగా వేధించారని ఆరోపించాయి.

అలాంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి. ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోషియేషన్ (ఏఐడీడబ్ల్యూఏ), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ), ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్ అసోషియేషన్ (ఏఐపీడబ్ల్యూఏ),

ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక్ సంఘటన్ (ఏఐఎంఎస్‌ఎస్) తదితర మహిళా సంఘాలతోపాటు ఎస్‌ఎఫ్‌ఐ వంటి స్డూడెంట్ యూనియన్లు శనివారం ఉదయం గురుద్వారా బంగ్లా నుంచి అశోక్ రోడ్డులోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ చేపట్టారు. మహిళా నిరసనకారులను వేధించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని అక్కడ ధర్నా చేపట్టారు. ‘ఢిల్లీ పోలీస్ శరం కరో..’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. 

మహిళా జర్నలిస్టులను వేధించినవారిపై చర్యలేవీ?

దేశ రాజధానిలో జులై 20 నుంచి వేధింపులు కొనసాగుతున్నాయని మహిళా సంఘాలు ఆరోపించాయి. నీట్ అవకతకలపై నిరసన తెలిపేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారని, వారిలో చాలా మందిని ఢిల్లీ పోలీసులు లైంగికంగా వేధించారని మండిపడ్డాయి. ఇప్పుడు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్, ‘సర్’కు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతుంటే కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారని..

ఇందుకు సంబంధించి ఫొటో, వీడియో సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నాయి. మహిళలను లక్ష్యంగా చేసుకొని మగ పోలీసులు దాడులకు పాల్పడ్డారని.. వ్యాన్లలో, నిర్బంద కేంద్రాల్లోనూ శారీరకంగా హింసించారని ఆందోళన వ్యక్తం చేశాయి.  ఈ నెల 3న సర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు కవర్ చేయడానికి వెళ్లిన ముగ్గురు మహిళా జర్నలిస్టులను మగ పోలీసులు వేధించారని, ఈ వ్యవహారంలో ఏసీపీ వివేక్ భగత్‌పై ఫిర్యాదు చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదని మహిళా సంఘాలు నిలదీశాయి.

కులం పేరుతో కూడా మహిళా జర్నలిస్టులను దూషించారని తెలిపాయి. వేధింపులకు పాల్పడ్డ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశాయి. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ మాజీ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా మాట్లాడుతూ.. ‘హక్కుల కోసం గొంతెత్తుతున్న మహిళలను అణచివేయాలని ఢిల్లీ పోలీసులు చూస్తున్నారు. నిరసన ప్రదేశాల్లోనే శారీరకంగా వేధిస్తున్నారు. ఇదంతా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోనే జరుగుతున్నది. మహిళలపై దాడులకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని. అమిత్ షా రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తలు