30-08-2025 01:05:50 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి వ్యవసాయ శాఖ కమిషనర్‌కి(Commissioner of Agriculture) ఎరువుల కొరతపై వినతి పత్రం ఇవ్వడానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. రైతులకు యూరియా సరఫరా చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులతో అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్ కు చేరుకుని రాష్ట్రంలో ఎరువుల కొరతపై అగ్రికల్చర్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చారు. యూరియా మీద స్పష్టమైన హామీ ఇచ్చేవరకు, కదిలేది లేదంటూ వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బైఠాయించారు. యూరియా కావాలని రైతుల పక్షాన ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులను అగ్రికల్చర్ కమిషనరేట్ కార్యాలయంలో అరెస్టు చేసిన పోలీసులు అక్కడి నుంచి తరలించారు. కేటీఆర్, హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కార్యాలయం మందు బైఠాయిస్తామని కేటీఆర్ తేల్చిచెప్పారు. గణపతి బప్పా మోరియా.. రావాలయ్యా యూరియా అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు.
వ్యవసాయ శాఖ కమిషనర్‌కి వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... ఏ రాష్ట్రాల్లోనూ యూరియా సమస్య లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే.. రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని ఆయన ఆరోపించారు. కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా తాము ఎరువులు అందించాం.. ఇప్పుడు ఏమైంది అంటూ నిలదీశారు. గత నెల రోజులుగా రైతులు నిద్రాహారాలు మాని తెల్లవారు జాము నుండే పడిగాపులు కాస్తుంటే మీకు పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు నెపం వేసుకుని తప్పించుకుంటున్నారని విమర్శించారు. యూరియా పంపిణీ చేతకాకపోతే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. యూరియా మీద స్పష్టమైన హామీ ఇచ్చేవరకు, కదిలేది లేదంటూ వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం ముందు బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎరువుల కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్షమే కారణమంటూ నినాదాలు చేశారు. ''మేం రాజకీయాల కోసం రాలేదు.. రైతుల కోసం వచ్చాం'' అని హరీశ్ రావు పేర్కొన్నారు. యూరియా కోసం వెళ్తే రైతులపై దాడి చేస్తున్నారని చేస్తున్నారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులపై దాడికి సంబంధించిన దృశ్యాలు ఇంటర్ నెట్ లో వచ్చాయని వెల్లడించారు. యూరియాపై సీఎం ఒక్కరోజైనా సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు. మేం పార్టీ తరుఫున ఎక్కడా ఆందోళన చేయలేదు.. ప్రజలే ఆందోళన చేస్తున్నారని వివరించారు. ప్రజల ఆందోళనలు చూసైనా ప్రభుత్వం అప్రమత్తం అయ్యి ఉండాల్సిందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.