30-08-2025 09:35:07 PM
రైతులకు సరిపడా ఊరియా సప్లైచేయాలి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న
పినపాక (విజయక్రాంతి): యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కన్నుమూసుకుంటుందా అంటూ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న(CPM District Committee Member Nimmala Venkanna) మండిపడ్డారు. శనివారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల సహకార సంఘ కార్యాలయం వద్ద రైతులను కలిసి సమస్యలు విన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. యూరియా కోసం రైతులు ఉదయం నుంచి లైన్ లో నిలబడలేక చెప్పులు లైన్లో పెట్టిన పరిస్థితి దాపురించిందన్నారు. తెల్లవారుజామున మూడు గంటలకే రైతులు పీఏసీసీఎస్ చేరుకొని క్యూలో ఉంటే రైతుకు యూరియా అందని పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
రైతులకు యూరియా కష్టాలు తీర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. నానో యూరియా వాడాలని చెబుతున్న ప్రభుత్వం రైతులకు ఎందుకు అవగాహన కల్పించడం లేదన్నారు. తెలంగాణలో వానాకాలం పంటలకు అవసరమైన ఎరువులు దొరక్క రైతులు ఆందోళన చెందుతుంటే, ప్రభుత్వం మాత్రం స్థానిక ఎన్నికలపై దృష్టి సారించిందన్నారు. రైతులకు న్యాయం జరగకపోతే రైతుల పక్షాన అండగా ఉండి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.