calender_icon.png 7 August, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిల్లు కోసం పోరాడుతాం: సీఎం రేవంత్ రెడ్డి

07-08-2025 01:16:16 PM

బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 మార్గాలు: సీఎం

న్యూఢిల్లీ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అన్నారు. బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రపతి(President of India) అపాయింట్ మెంట్ కోసం సాయంత్రం వరకు వేచి చూస్తామన్నారు. రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రపతి సమయం ఇవ్వలేదంటే ప్రధాని ఒత్తిడి చేసినట్లు భావించాల్సి ఉంటుందని సూచించారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఉన్న మార్గాలన్నింటినీ ప్రయత్నించామని సీఎం స్పష్టం చేశారు.

కుదరనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్లో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సీఎం తేల్చిచెప్పారు. బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అమలుకు తమ వద్ద మూడు మార్గాలున్నాయని తెలిపారు. 50 శాతం సీలింగ్ పై గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీవో ఇవ్వాలన్నారు. జీవో ఇస్తే.. ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇస్తుంది. జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లే మొదటి మార్గం సాధ్యం కాదన్నారు. ఇప్పుడే స్థానిక ఎన్నికలు పెట్టకుండా ఆపడం రెండో మార్గం అన్నారు. స్థానిక ఎన్నికలు ఆపితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగుతాయని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాకుంటే గ్రామాల్లో వ్యవస్థలు కుప్పకూలుతాయని వివరించారు. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వడం మూడో మార్గం అన్నారు.

బీసీలకు 42 శాతం సీట్లపై ఇతర పార్టీలపైనా ఒత్తిడి తెస్తామని చెప్పారు. నోటిఫికేషన్ ఇచ్చి, కోర్టు ఆదేశం ప్రకారం సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని సీఎం వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ అమలుపై ఢిల్లీలోని జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద కాంగ్రెస్ పార్టీ మూడో రోజు ధర్నా చేస్తోంది. బీసీ రిజర్వేషన్ అమలుకు నేడు రాష్ట్రపతిని కలవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కాంగ్రెస్ కు లభించలేదు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభ తీర్మానించిన రెండు బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రాష్ట్రపతి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని అడ్డుగా ఉన్న పరిమితి తొలగిస్తూ సంబంధిత చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ కు కూడా ఆమోదముద్ర వేయాలని విజ్ఞప్తి చేశారు.