07-11-2025 12:47:06 PM
పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం..
పరిస్థితి విషమం గాంధీ ఆసుపత్రికి తరలింపు.
తాండూరు,(విజయక్రాంతి): ఆస్తి రాసి ఇవ్వడం లేదని కూతురు, అల్లుడు కలసి ఒక వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా యాలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన కమ్మరి కృష్ణ కూతురు అనితకు షాబాద్ మండలానికి చెందిన అర్జున్ తో కొన్నేళ్ల క్రితం వివాహం చేసాడు. అయితే కూతురు అనిత మరియు ఆమె భర్త అర్జున్ కొన్ని రోజులుగా కమ్మరి కృష్ణ పేరుపై ఉన్న ఇల్లు మరియు రెండు ఎకరాల పొలాన్ని తమ పేరుపై చేయాలంటూ వేధింపులకు గురి చేశారు.
ఆస్తి రాసిస్తే తనకు నిలువ, నీడ , కూడు ఉండదని నేను ఉన్నంతవరకు ఆస్తి నా పేరు పైనే ఉంటుంది అని కృష్ణ తేల్చి చెప్పాడు. దీంతో తండ్రి కృష్ణను చంపేస్తే ఆస్తి దక్కుతుందని దురుద్దేశంతో కన్న కూతురు, అల్లుడు అర్జున్ నేడు ఉదయం అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు గమనించి మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చికిత్స కోసం తాండూరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి 25% గాయాలు అయ్యాయని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ మేరకు యాలాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.