calender_icon.png 7 November, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ రాదు: మంత్రి పొన్నం

07-11-2025 02:43:23 PM

జూబ్లీహిల్స్ లో బీజేపీకి 10 వేల ఓట్లు కూడా రావు

కిషన్ రెడ్డి.. తక్కువ ఓట్లు వస్తే ఏం చేస్తావో చెప్పాలి: మంత్రి పొన్నం

హైదరాబాద్: జూబ్లీహిల్స్ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి కనీసం డిపాజిట్ కూడా రాదని సూచించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీకి 10 వేల ఓట్లు కూడా రావాని చెప్పారు. కిషన్ రెడ్డి నియోజకవర్గంలోనే బీజేపీని ఎవరూ పట్టించుకోవట్లేదని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి.. తక్కువ ఓట్లు వస్తే ఏం చేస్తావో చెప్పాలని మంత్రి పొన్నం సవాల్ చేశారు. బీజేపీ-బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. కిషన్ రెడ్డి తానా అంటే కేటీఆర్ తందానా అంటున్నారని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలపై స్పందించిన మంత్రి పొన్నం చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో సోదాలు సహజం.. ఎవరి ఇంట్లో అయినా చేస్తారని తెలిపారు. ఎన్నికల సంఘం పరిధిలో ఫ్లయింగ్ స్వ్కాడ్ పనిచేస్తోందని చెప్పిన మంత్రి పొన్నం ఫిర్యాదులు వస్తే సోదాలు చేయడం ఎన్నికల సంఘం హక్కు అన్నారు. ప్రతిదాన్ని రాజకీయం చేయడం బీఆర్ఎస్ అలవాటు అన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ...  జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కాకుండా బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని తేల్చిచెప్పారు. నవంబర్ 14న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని భారీగా నగదు దాచిపెట్టారనే అనుమానంతో పోలీసులు, ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ టి. రవీందర్ రావు ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. మోతినగర్‌లోని రెడ్డి ఇళ్లపై, కూకట్‌పల్లిలోని రావు ఇళ్లపై ప్రత్యేక బృందాలు దాడి చేసి వారి ఇళ్లను తనిఖీ చేయడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. సోదాల గురించి విన్న బీఆర్‌ఎస్ నాయకులు వారికి సంఘీభావం తెలిపేందుకు వారి ఇళ్లకు చేరుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించడంపై మర్రి జనార్దన్ రెడ్డికి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనున్నందున పోలీసులు సోదాలు కొనసాగించారు. సోదాలపై బీఆర్ఎస్ ప్రతిస్పందిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగాన్ని బహిరంగంగానే నిందించింది.