calender_icon.png 17 October, 2025 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీకి గురైన 1061 ఫోన్లు రికవరీ

17-10-2025 01:12:44 AM

  1. రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల విలువ రూ.3.20 కోట్లు 

ఫోన్లను బాధితులకు అందజేసిన క్రైమ్స్ డీసీపీ ముత్యంరెడ్డి

శేరిలింగంపల్లి, అక్టోబర్ 16: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో చోరీకి గురైన ఫోన్లను గురువారం సైబరాబాద్ కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమంలో బాధితులకు అందజేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దొంగతనానికి గురైన సుమారు రూ.3.20 కోట్ల విలువైన 1061 మొబైల్ ఫోన్లను సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ముత్యంరెడ్డి బాధితులకు అప్పగించారు.

వీటిలో ఐఫోన్లతో పాటు పలు విలువైన స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. కొందరి ఫోన్లు సంవత్సరం తర్వాత దొరకగా, మరికొన్ని కేవలం 15 రోజుల్లోనే రికవరీ కావడం విశేషం. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి పొందిన బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ముత్యంరెడ్డి మాట్లాడుతూ ఎక్కడ క్రైమ్ జరిగినా, నిందితుల అంతు చూసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధంగా ఉంటారు.

తక్కువ ధరకు వస్తున్నాయని సెల్‌ఫోన్లను కొనకండి. దొంగతనానికి గురైన ఫోన్లను కొనడం లేదా కలిగి ఉండడం కూడా నేరమే అని స్పష్టం చేశారు. గతంలో చైన్ స్నాచింగులు, ఇళ్లలో దొంగతనాలు ఎక్కువగా జరిగేవి. కానీ ఇటీవల కాలంలో సెల్‌ఫోన్ల దొంగతనాలు, సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. కొన్నిసార్లు అనుకోకుండా, ఉద్దేశపూర్వకంగా దొంగలు మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్నారని తెలిపారు.

రోజుకు అనేక ఫోన్లు చోరీకి గురవుతున్నాయని చెప్పారు. సైబరాబాద్ పరిధిలోని ఐదు సీసీఎస్ పోలీసు బృందాలు నిరంతరం కృషి చేసి, ఎంతో శ్రమించి ఈ ఫోన్లను రికవరీ చేశాయని, సైబరాబాద్ పరిధిలో చోరీకి గురై దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫోన్లను కూడా తిరిగి తెప్పించామని వివరించారు.

పోలీసు వ్యవస్థ సమాజంలో సత్ప్రవర్తనకు దోహదపడుతుందని, ప్రజలు కూడా సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని డీసీపీ ముత్యంరెడ్డి పిలుపునిచ్చారు. నగరంలో దొంగతనానికి గురైన ఫోన్లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని హెచ్చరిస్తూ సాధ్యమైనంత వరకు ఫోన్లు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్‌హ్యాండ్ ఫోన్లు అసలు కొనవద్దు అని సూచించారు.

చాలా నేరాలు ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ద్వారానే జరుగుతున్నాయని, పోగొట్టుకున్న ఫోన్లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళితే మరింత ప్రమాదం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజలు తమ మొబైల్‌ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని, దొంగ సొమ్ములు కొనకూడదని, అవి కొన్నా లేదా మీ వద్ద ఉన్నా నేరమే అని హెచ్చరించారు. అలాగే అనుమానాస్పద యాప్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలు జరిగితే “1930” నంబర్‌కు కాల్ చేయాలని డీసీపీ సూచించారు. పోగొట్టుకున్న ఫోన్ల రికవరీలో కీలక పాత్ర పోషించిన సీఐలు, ఎస్సులు, కానిస్టేబుళ్లను డీసీపీ ముత్యంరెడ్డి అభినందించారు.

ఎనిమిది విడతల్లో 13,423 ఫోన్లు.. 

ఇప్పటివరకు జరిగిన తొమ్మిది విడతల్లో సైబరాబాద్ పరిధిలో చోరీకి గురైన మొత్తం 13,423 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. తాజాగా 9వ విడతలో మాదాపూర్, బాలానగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్‌లతో పాటు ఐటీ సెల్, మేడ్చల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 1061 సెల్‌ఫోన్లు రికవరీ చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల పోలీస్ సిబ్బంది, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.