619 ఎకరాల్లో పంట నష్టం

07-05-2024 01:59:39 AM

జనగామ, మే 6 (విజయక్రాంతి): అకాల వర్షానికి జనగామ జిల్లాలో వందల ఎకరాల్లో వివిధ పంటలు ధ్వంసమయ్యాయి. ఆదివారం సాయంత్రం జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వరి, మక్కజొన్న పంటలు ధ్వంసం కావడంతోపాటు మామిడితోటల్లో కాయలు రాలిపోయాయి. సోమవారం జిల్లాలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, లింగాలఘన్‌పూర్ మండలాల్లో నష్టపోయిన పంటలను వ్యవసాయ, ఉద్యానవన శాఖ జిల్లా అధికారులు వినోద్‌కుమార్, కేఆర్ లత పరిశీలించారు. సుమారు 619 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు ప్రాథమికంగా గుర్తించారు. పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్టు  తెలిపారు. రైతుల వారీగా నష్టం వివరాలను సేకరించి సమగ్ర నివేదికను తమకు అందించాలని వ్యవసాయ విస్తరణాధికారులను ఆదేశించారు.