31-07-2025 01:42:04 AM
న్యూఢిల్లీ, జూలై 30: బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. ఎనిమిదో రోజైన బుధవారం కూ డా ఓటర్ల జాబితా సవరణపై విపక్షాలు నిరసన చేపట్టారు. సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎం పీలు ప్లకార్డులు, బ్యానర్‌లు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఎస్‌ఐఆర్‌ను వెనక్కి తీసు కోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోని యాగాంధీ, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ సహా ఇతర ఎంపీలు పాల్గొన్నారు. మరోవైపు రాజ్యసభలో రెండో రోజు ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై చర్చ కొనసాగింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, జై శంకర్, జేపీ నడ్డా విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
తలలో నుంచి బులెట్లు దూసుకెళ్లాయి: అమిత్ షా
పహల్గాం ఉగ్రదాడుల్లో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను ‘ఆపరేషన్ మహదేవ్’లో బలగాలు మట్టుబెట్టాయని, ముగ్గురి తలలోంచి బుల్లెట్లు దూసుకెళ్లాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభకు తెలిపారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై రాజ్యసభలో అమిత్ షా మాట్లాడారు.
‘పహల్గాం ఘటన జరిగిన నెల రోజుల తర్వాత టెర్రరిస్టుల ఉనికి గురించిన సమాజం మాకు అందింది. ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలటరీ ఇంటెలిజెన్స్ వెంటనే వారి ఐడెంటినీని ధ్రువీకరించుకుని, జూలై 22 నాటికి వైర్‌లెస్ సెట్‌లు ట్రాకింగ్ పూర్తి చేశాయి. ఉగ్రవాదులు ఎక్కడున్నారనే నిర్దిష్ట లొకేషన్ గుర్తించాయి’ అని తెలిపారు.
బుల్లెట్ పేల్చిన వారికి కాంగ్రెస్ బిర్యానీ: నడ్డా
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో బాంబు పేలుళ్లు జరగని నగరమే లేదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా దుయ్యబట్టారు. వారి హ యాంలో ఉగ్రవాదాన్ని చూసీచూడనట్టు వదిలేశారని మండిపడ్డారు. రాజ్యసభలో జరుగుతున్న ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చలో భాగం గా ఆయన ప్రసంగించారు. ‘పహల్గాం దాడి, అనంతరం చర్యలపై ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న వారు గతంలో వారి పాలనను గుర్తుచేసుకోవాలి.
వారి హయాంలో ఢిల్లీ, వారణాసి, ముంబై ఇలా ఎన్నో చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. వందల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదా న్ని అరికట్టేందుకు వారు పాకిస్థాన్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. మనపై బుల్లెట్టు పేల్చిన వారికి కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది. ఉగ్రదాడులు చేస్తున్న వారితో వాణిజ్య బంధాలు పెంచుకుంది’ అని నడ్డా మండిపడ్డారు.
అప్పటివరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత: జైశంకర్
రాజ్యసభలో ‘ఆపరేషన్ సిందూర్’ పై సాగిన చర్చలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ గట్టి బదులు ఇచ్చిందని.. దాయాది దేశం ఉగ్రవాదాన్ని వదిలిపెట్టే వరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందన్నారు. ‘60 ఏళ్ల పాటు మాజీ ప్రధాని నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దలేమని చెప్తూ వచ్చారు.
కానీ వాటిని మార్చవచ్చని మోదీ ప్రభుత్వం చూపించింది. అందుకు ఉదాహరణలే.. ఆర్టికల్ 370 రద్దు. ఇప్పుడు సింధూ జలాల ఒప్పందాన్ని సరిదిద్దుతున్నాం. పహల్గాం దాడికి కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను తన నివేదికలో ఐక్యరాజ్యసమితి తొలిసారి ప్రస్తావించింది’ అని వెల్లడించారు.
ప్రధానికి సిందూరం విలువ తెలుసా?: రేణుకా చౌదరీ
రాజ్యసభలో ‘ఆపరేషన్ సిందూర్’పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ఎనిమిది దేశాల్లో చక్కర్లు కొట్టొచ్చారు.. కానీ పహల్గాం ఉగ్రదాడిలో బాధితులను కలిసేందుకు మాత్రం ప్రధాని నరేంద్ర మోదీకి సమయం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి విషాదం జరిగి మృతుల కుటుంబాలు షాక్‌లో ఉంటే వారిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.
అసలు ప్రధానికి ఆడబిడ్డ నుదుటిపై ఉన్న సిందూరం విలువ తెలుసా అని ప్రశ్నించారు. పహల్గాం టెర్రర్ అటాక్‌పై ఎవరికీ జవాబుదారీతనం లేకుండా పోయిందని రేణుకా చౌదరీ మండిపడ్డారు.