ఆర్టీసీ బస్సులో సీటు కోసం గొడవ
- సమాచారం చేరవేసిన ప్రయాణీకుడు
- కాపు కాచి పది మందితో మూకుమ్మడి దాడి
ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్టీసీ బస్సుల్లో సీటు కోసం మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానై ఘర్షణకు దారి తీసింది. గొడవ పడిన ప్రయాణీకులు సద్దుమనిగితే మూడో వ్యక్తి తల దూర్చి ఆజ్యం పోసిన సంఘటన వెలుగు చూసింది. ప్రయాణిలు కొట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం నిర్మల్ నుంచి నిజామాబాద్ వెళ్లే బస్సులో ఓ వ్యక్తి సీటుకోసం ఖర్చీఫ్ వేశాడు. ఆ సీట్లో మరో వ్యక్తి కూర్చోవడంతో ఖర్చీఫ్ వేశాడు.
ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో తోటి ప్రయాణికులు సర్ధి చెప్పడంతో ఇద్దరు కలిసి అదే సీట్లో కూర్చున్నారు. అయితే ఇదంతా గమనించిన ఓ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి.. ఖర్చీఫ్ వేసిన మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎలా సీటు ఇస్తావంటూ తన సామాజికవర్గానికి చెందిన ప్రయాణికుడిని రెచ్చగొట్టాడు. అంతేకాకుండా ఆర్మూర్‌లో ఉన్న తన సామాజికవర్గ యువకులు సమాచారం అందించాడు.
బస్సు పెర్కిట్ ఆర్టీసీ బస్టాండ్ ఏరియాకి రాగానే 10 మంది యువకులు ఒక్కసారిగా బస్సు ఎక్కి ఖర్చీఫ్ వేసిన ప్రయాణికుడిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. బస్సులో ఉన్న మహిళలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిపైనా పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో ఖర్చీఫ్ వేసిన ప్రయాణికుడికి గాయాలు అయ్యాయి. బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులు కలగజేసుకోవడంతో యువకులు వెళ్లిపోయారు. కాగా, సీటు కోసం రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణకు దారితీయడం పట్టణంలో తీవ్ర కలకలం సృష్టించింది.
ఇద్దరు ప్రయాణికులు కాంప్రమైజ్జ్ అయ్యి కూర్చున్నా.. మూడోవ్యక్తి రెచ్చగొట్టి గొడవ పెట్టడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దెబ్బలు తిన్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై అకారణంగా దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఆర్టీసీ బస్సులో జరిగిన గొడవ విషయంలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.




