సమగ్ర డిజిటల్ డ్యాష్‌బోర్డ్ రూపొందించాలి
టీజీఐఐసీ అధికారులకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు
పనుల పురోగతిని సమీక్షించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి) : పారిశ్రామిక పార్కులు, క్లస్టర్ల ద్వారా రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడులు, ప్రారంభమైన ప్రాజెక్టులు, కల్పించిన ఉద్యోగాల వివరాలు వంటి ముఖ్య సూచికలను నమోదు చేసేలా సమగ్ర డిజిటల్ డ్యాష్‌బోర్డ్ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు టీజీఐఐసీ అధికారులను ఆదేశించారు. ఈ వ్యవస్థ ద్వారా పనుల పురోగతిని పారదర్శకంగా, పద్ధతిగా పర్యవేక్షించవచ్చని తెలిపారు.
తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి పనుల పురోగతిని సోమవారం సచివాలయంలో సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా టీజీఐఐసీ చేపడుతున్న వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలుపై జరిగిన సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు.
సమావేశంలో టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ కే.శశాంక సంస్థ చేపడుతున్న ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి కో సం తీసుకుంటున్న చర్యలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. జహీరాబాద్ వద్ద ప్రతిపాదిత ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, వరంగల్ సమీపంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, మెగా ఇండస్ట్రియల్ హబ్‌లు, ఫార్మా క్లస్టర్లు, అలాగే ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.




