13-01-2026 01:05:36 AM
హీరా గ్రూప్ స్కామ్ కేసు!
హైదరాబాద్, సిటీబ్యూరో జనవరి 12 (విజయక్రాంతి): వేల కోట్లు కొల్లగొట్టిన హీరా గ్రూప్ స్కామ్ కేసులో మరో సంచలనం. ఈ కేసులో ఈడీ విచారణను, ఆస్తుల వేలం ప్రక్రియను అడ్డుకునేందు కు యత్నించిన ఓ వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెం ట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. చట్టపరంగా తన ఆస్తులను కాపాడుకోలేకపోయిన హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్.. అధికారులను ప్రభావితం చేసేందుకు నెలవారీ జీతం, అధిక కమీషన్‌కు కల్యాణ్ బెనర్జీ అనే వ్యక్తిని దళారీగా నియమించుకున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారులు తనకు తెలు సంటూ ఈడీ అధికారులనే బెదిరించిన కల్యాణ్ బెనర్జీని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
అసలేం జరిగింది?
అధిక వడ్డీలు ఇస్తామని నమ్మించి ప్రజల నుంచి దాదాపు రూ. 5,978 కోట్లు వసూ లు చేసిన కేసులో నౌహీరా షేక్‌పై ఈడీ, మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన విష యం తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 428 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బాధితులకు న్యాయం చేసేందుకు సుప్రీం కోర్టు అనుమతితో ఈ ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించారు. అయితే, జనవరి 5న నిర్వహించిన వేలం ప్రక్రియను అడ్డుకునేందుకు నౌహీరా షేక్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేయడమే కాకుండా ఆమెకు రూ. 5 కోట్ల భా రీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ప్ర ధాన మంత్రి సహాయనిధికి జమచేయాలని ఆదేశించింది.
అడ్డదారిలో..
న్యాయస్థానాల్లో చుక్కెదురు కావడంతో నౌహీరా షేక్ అడ్డదారి తొక్కారు. ఈ క్రమంలోనే కల్యాణ్ బెనర్జీ అనే వ్యక్తిని నెలవారీ జీ తం, భారీ కమీషన్ ప్రాతిపదికన నియమించుకున్నారు. రంగంలోకి దిగిన కల్యాణ్ బెన ర్జీ.. తనకు సీనియర్ బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నా యంటూ ఈడీ అధికారులకు ఫోన్లు చేయ డం మొదలుపెట్టాడు. వేలం ఆపాలని ఒత్తిడి తెచ్చాడు. చట్ట ప్రకారం నడుచుకోవాలని అధికారులు చెప్పినప్పటికీ వినకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఈడీ నిఘా.. కల్యాణ్ బెనర్జీ నకిలీ..
అనుమానం వచ్చిన ఈడీ అధికారులు నిఘా పెట్టగా.. ఇతను సికింద్రాబాద్ కేంద్రం గా నకిలీ అవతారం ఎత్తినట్లు తేలింది. ప్రభు త్వ శాఖలకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నట్లు నమ్మించాడు. మొబైల్ సిమ్ కార్డులో నూ తప్పుడు అడ్రస్ ఇచ్చినట్లు గుర్తించారు. జనవరిలో సికింద్రాబాద్‌లోని అతడి నివాసంలో సోదాలు చేయగా.. నౌహీరా షేక్‌తో జరిపిన వాట్సాప్ చాట్లు బయటపడ్డాయి. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు, అక్రమ మార్గాల్లో ఆస్తుల అమ్మకానికి వీరిద్దరూ కుట్ర పన్నారని, ఇందుకు కల్యాణ్ బెనర్జీకి భారీ మొత్తం ముట్టజెప్పేలా ఒప్పందం జరిగిందని ఈడీ గుర్తించింది.
విచారణలో కల్యాణ్ బెనర్జీ తన నేరాన్ని అంగీకరించాడు. నౌహీరా షేక్ ఆదేశాల మేరకే తాను అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని పీఎంఎల్‌ఏ చట్టం కింద అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జనవరి 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దర్యాప్తులో జోక్యం చేసుకునే వారిని ఉపేక్షించేది లేదని ఈడీ స్పష్టం చేసింది.