12 May, 2026 | 1:24 AM

శతాబ్దాల విధ్వంసంపై సాంస్కృతిక విజయం

12-05-2026 12:00 AM

రామకిష్టయ్య సంగనభట్ల :

అరేబియా సముద్ర తరంగాల హోరులో, కాలపరీక్షకు ఎదురునిలిచి, భారతీయ ఆధ్యాత్మిక చైతన్యానికి మకుటాయమానంగా భాసిల్లుతున్న దివ్యక్షేత్రం సోమనాథ్. గుజరాత్‌లోని సౌరాష్ట్ర తీరాన ప్రభాస్ పటణంలో కొలు వుదీరిన ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రథమ లింగం మాత్రమే కాదు; అది శతాబ్దాల విధ్వంసాన్ని ఓడించిన సృజన శక్తికి, విదేశీ దండయాత్రల చీకట్లను చీల్చుకొని ఉదయించిన భారతీయ సాంస్కృతిక ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం.

స్వాతంత్య్రానంతరం వల్లభభాయ్ పటేల్ దృఢ సంకల్పంతో పునర్నిర్మితమైన ఈ ఆలయం 75 వసంతాలను పూర్తిచేసుకుంటున్న తరుణంలో, ఈ ప్రస్థానం భారత జాతీయ పునరుజ్జీవన చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. సోమనాథ్ చరిత్ర పురాణ కాలం నాటి వైభవాన్ని పులుముకుంది. చంద్రుడు (సోముడు) దక్ష ప్రజాపతి శాపం వల్ల తన కాంతిని కోల్పోయినప్పుడు, ఈ పవిత్ర క్షేత్రంలో సరస్వతీ నది సముద్రంలో కలిసే త్రివేణి సంగమం వద్ద తపస్సు చేసి, పరమశివుని అను గ్రహంతో తిరిగి తన కళలను పొందాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

కృతయుగంలో చంద్రుడు బంగారంతోనూ, త్రేతాయుగంలో రావణుడు వెండితోనూ, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గంధపు చెక్కతోనూ ఈ ఆలయాన్ని నిర్మించారని భక్తుల విశ్వాసం. మౌర్యులు, గుప్తులు, చాళుక్యులు, ప్రతిహార రాజులు ఈ ఆలయాన్ని విస్తరించి, భారతీయ వాస్తుకళా వైభవానికి చిరునామాగా మార్చారు. మధ్యయుగ కాలంలో సోమనాథ్ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాక, అపారమైన సంపదకు నిలయంగా వర్ధిల్లింది. ఈ సంపదే విదేశీ ఆక్రమణదారుల కన్ను ఈ క్షేత్రంపై పడేలా చేసింది.

క్రీస్తుశకం 1025లో గజనీ మహ్మద్ ఈ క్షేత్రంపై దాడిచేయడం భారత చరిత్రలో అత్యంత విషాదకర ఘట్టం. ఆలయంలోని వజ్రవైఢూర్యాలను, టన్నుల కొద్దీ బంగారాన్ని దోచుకెళ్లడమే కాక, భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడానికి గర్భాలయంలోని జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేశాడు. అయితే, ఆ తర్వాత పరమార భోజరాజు, అన్హిల్వాడ్ రాజైన భీమదేవుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆ తర్వాత అల్లావుద్దీన్, జఫర్ ఖాన్, చివరగా ఔరంగజేబు పదేపదే ఈ ఆలయాన్ని నేలమట్టం చేశారు.

ప్రతిసారి సోమనాథ్ మరింత దృఢంగా పురు డుపోసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 13 నవంబర్ 1947న సోమనాథ్‌ను సందర్శించిన పటేల్ ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. 1951 మే 11న జరిగిన జ్యోతిర్లింగ ప్రాణ ప్రతిష్ఠకు దేశ తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ హాజరై చిరస్మరణీయ ప్రసంగం చేశారు. ప్రస్తుత సోమనాథ్ ఆలయం ‘మరు-గుర్జర’ (చాళుక్య) శైలిలో అద్భుతమైన శిల్పకళా సంపదతో అలరారుతోంది. సుమారు 155 అడుగుల ఎత్తు ఉన్న ఈ మహాశిఖరం భారతీయ వాస్తుశాస్త్ర నైపుణ్యానికి తార్కాణం.

ఆలయ ప్రాంగణంలోని ‘బాణస్తంభం’ ప్రాచీన భారతీయుల భౌగోళిక విజ్ఞానానికి ఒక నిదర్శనం. ఈ స్తంభం నుంచి దక్షిణ ధృవం (అంటార్కిటికా) వరకు మధ్యలో ఎక్కడా భూభాగం లేదని, అంతా జలమేనని ఆ స్తంభంపై ఉన్న సంస్కృత శ్లోకం వివరిస్తుంది. గత కొన్నేళ్లుగా సోమనాథ్ క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో సరికొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధాని మోదీ సోమనాథ్ ట్రస్ట్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక, ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

ఆలయం చుట్టూ నడిచే భక్తులకు ‘సముద్ర దర్శన్ పథ్’ అద్భుత అనుభూతిని కలిగిస్తోంది. సోమనాథ్ ఒక సాంస్కృతిక విప్లవం. సోమనాథ్ పునర్నిర్మాణం ద్వారా ప్రారంభమైన ఈ ‘జాతీయ పునరుజ్జీవన యాత్ర’ నేడు కాశీ విశ్వనాథ్ ధామ్, ఉజ్జయిని మహాకాల్ కారిడార్, అయోధ్య రామమందిర నిర్మాణాల వరకు కొనసాగుతోంది. భారతదేశం తన విస్మృత వైభవాన్ని తిరిగి వెతుక్కునే క్రమంలో సోమనాథ్ తొలి అడుగుగా నిలిచింది.

75 ఏళ్ల క్రితం రాజేంద్ర ప్రసాద్ నాటిన ఆ పునరుజ్జీవన బీజం నేడు మహావృక్షమై, ప్రపంచ దేశాల ముందు భారతదేశ ఘనమైన వారసత్వాన్ని సగర్వంగా నిలబెడుతోంది. ఎన్నటికీ అంతం లేని ఆ పరమేశ్వరుని తత్వంలాగే, సోమనాథ్ వైభవం కూడా తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.

 వ్యాసకర్త: జర్నలిస్ట్, 9440595494