12 May, 2026 | 2:26 AM

కలిసి నడుస్తాం

12-05-2026 01:19 AM
  1. ప్రధాని పిలుపులో రాజకీయం ఏమీ లేదు 
  2. నేను బీజేపీని ఓడించే సీఎం అయ్యాను 
  3. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): తమతో కలిసి రావాలని ప్రధాని మోదీ పిలుపులో రాజకీయం లేదని, ఆయన పిలుపును స్వాగతిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు తనకు అభ్యంతరం లేదన్నా రు. వికసిత్ భారత్‌లాగానే విజన్ 2047 సాధనకు, ట్రి ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అందుకునేందుకు కేంద్రం తో కలిసి నడుస్తామని వెల్లడించారు.

కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు లేవు.. రాజకీయ అంశాలకూ తావు లేదని స్పష్టం చేశారు. ‘నేను, మోదీ ప్రస్తావించింది అభివృద్ధి మాత్రమే.. అభివృద్ధి విషయంలో కలిసి పనిచేద్దామని ఆయన చెప్పా రు’ అని తెలిపారు. మా ఇద్దరి మధ్య జరిగిన ప్రస్తావన అభివృద్ధికి చెందినది మాత్రమే.. అందులో రాజకీయాలకు తావులేదన్నారు. సోమవారం మీడియాతో నిర్వ హించిన చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

ప్రభుత్వ కార్యక్రమంలో ‘నేను అడిగిన అంశాలను ప్రధాని మోదీ అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని మేం పరిగణనలోకి తీసుకోక తప్పదు’ అని అన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని ఏమీ అడగలేదని, మెదక్ సభలో ‘నిధులు వద్దు.. మీ ప్రేమ చాలు’ అని మోదీతో కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ‘మేం అలా అనడం లేదు.. నిధులు అడిగాం’ అని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డులో 50 శాతం నిధులు కేంద్రం ఇవ్వాలని తెలిపారు. ‘నేను ఎలాంటి వాడినో అందరికీ తెలుసు.

మోదీ మాటలను ఎవరికి వారు అర్థం చేసుకుంటున్నారు. నేను బీజేపీని ఓడించే సీఎం అయ్యా’ నని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని తీసుకెళ్తానని మోదీ అన్నారని, ‘నన్ను కాదు’ అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సమన్వయం పైన ‘మేం చర్చించాం’అని, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిందే.. అది హక్కు ..వాటిని సాధించుకుంటామని స్పష్టం చేశారు. 2034 వరకు వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిద్దాలని ‘నేను అడిగాను.

దానికి మోదీ ఆమోదం తెలిపారు’ అని సీఎం రేవంత్ చెప్పారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తే ‘నన్ను విమర్శించినట్టే’ అని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి ఆశించిన మేరకు సహకారం లేదన్నారు. రీజనల్ రింగ్ రో డ్డు నార్త్ ఫార్ట్, కాకతీయ మెగా టెక్స్ టైల్స్, ఎయిర్ పోర్టులు క్లియర్, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీ కోసం ఏడీబీ నిధులు, నేషనల్ హైవే లు వచ్చాయని రేవంత్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవి ముందుకు సాగలేదని, ‘మేం వచ్చాక క్లియర్ చేయిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

మెట్రో, సదరన్ పార్టు రీజనల్ రింగ్ రోడ్డు ఇలా కొన్ని పెండింగ్‌లో ఉ న్నాయన్నారు. సింగిల్ విండో విధానం తీసుకువచ్చి పరిష్కరించమని ప్రధానిని కోరా మని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో ప్రధాని మోదీ సమావేశం కావడం ప్రై వేట్ కార్యక్రమం అన్నారు. బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీ... విభజించు, పాలించు అన్నదే వాళ్ల సిద్ధాంతమని ఎద్దేవా చేశారు.

ముస్లిం లు, క్రిస్టియన్లు, ఇతర మతాలు, కులాలు, మావోయిస్టులు దేశ ప్రజలు కారా.. అందరికీ సమాన హక్కులు ఉన్నాయని వెల్లడిం చారు. ‘బీజేపీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వా ళ్లను ఖతం చేయడం వాళ్ల విధానం. మా సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్లను ఒప్పించి జనజీవనంలో కలపడం మా విధానం’ అని స్పష్టం చేశారు.  మావోయిస్టుల లొంగుబాటుపైన ‘మేం ప్రత్యేక చొరవ’ తీసుకున్నా మని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నక్సలైట్లు, కమ్యూనిస్టులు ఏ సమస్యలపైన కొట్లాడారో వాటిపైన ‘మేం చట్టాలు చేశాం’ అని చెప్పారు.

సమస్యలు తగ్గిపోవడం వల్లనే నక్సలిజం తగ్గిపోతూ వచ్చిందన్నారు. ‘బుల్లెట్ కాదు బ్యాలెట్ అని మేం అన్నాం.. చివరకు మావోయిస్టులు మా లైన్ కువచ్చారు’ అని చెప్పా రు. మావోయిస్టులు, ముస్లింలు ఈ దేశంలో భాగస్వాములు అని, ముస్లింలను వేరే చేసి చూపించడం మంచిది కాదన్నారు. కలిసి ఉండాలని ప్రధాని మాట్లాడాలి కానీ విడగొట్టాలని మాట్లాడం దురద్రుష్టకరమని, ఇది బీజేపీ విధానం.. బీజేపీ వివక్ష అన్నారు.

818 మంది మావోయిస్టులు తెలంగాణలో సరెండర్ అయ్యారు.. దేశంలోనే ఎక్కడా ఇలా జరగలేదని తెలిపారు. ఇంత మంది మావోయిస్టులను సరెండర్ చేయించడాన్ని మేం గొప్పగా భావిస్తున్నామని, గణపతి కూడా జనజీవన స్రవంతిలో కలవాలి.. ప్రభుత్వం నుంచి వైద్య సాయం, ఆర్థిక సాయం కూడా అందిస్తామని పిలుపునిచ్చారు. రాజీవ్‌గాంధీని చంపిన వాళ్లకు కూడా సోనియాగాంధీ క్షమాభిక్ష పెట్టారని గుర్తు చేశారు. 

బీజేపీ ఆయుధంగా ఎస్‌ఐఆర్..

బంగారం కొనొద్దు, విమానాల్లో ప్రయా ణం చేయొద్దని చెప్పడం మోదీ వైఫల్యమని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. విదేశీ విధానంలో మోదీ ప్రభుత్వ అసమర్థ పాలనతో విఫలమైందన్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడా నికి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇది బాధ్యతారాహిత్యమైనదని, రాహుల్ గాంధీ మొదటి నుంచి అదే చెపుతున్నారని తెలిపా రు. దీనిపై ప్రతిపక్షాల సూచనలను తీసుకోవాలి..అఖిలపక్షాలను పిలిచి మాట్లాడాల న్నారు.

కేంద్రానికి స్పష్టమైన విధానం లేదని, జెమిని సర్కస్ లా బీజేపీ ఎన్నికల వి ధానం ఉంటుందన్నారు. అనుభవరాహి త్యం, అహంకారం వల్లనే దేశాన్నిసంక్షో భం లోకి నెడుతున్నారని, గాలిని తిని గాల్లో బతకమని మోదీ చెప్పిపోయారని ఎద్దేవా చేశా రు. యూరియా కేంద్రం ఇవ్వాలి.. రాష్ట్ర ప్రభుత్వం పంచాలన్నారు. కేరళలో 3 సీట్లు, తమిళనాడులో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుందన్నారు. ఎస్‌ఐఆర్‌ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోందని, ఏ రాష్ట్రం లో గెలవాలంటే అక్కడ ఎస్‌ఐఆర్‌ను ప్రయోగిస్తున్నారని చెప్పారు.

జూబ్లీహిల్స్‌లో బీజేపీ కి డిపాజిట్ రాలేదని, మున్సిపాలిటీల్లో బీజేపీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మహి ళా రిజర్వేషన్‌ను దేనికీ సంబంధం లే కుండా అమలు చేయడానికి అవకాశం ఉం దని, 2011 జనాభా లెక్కల ప్రకారం మహి ళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చన్నారు.

నియోజకవర్గాల పునర్విభజన 543 లోక్ సభ సీట్లను దామాషా ప్రకారం చేసేందుకు అవకాశం ఉందని, 50 శాతం పెంపు అన్న దాని కి కూడా ఇక ఫార్ములా లేదన్నారు. సీట్ల పెంపకంపైనే అందరికీ అభ్యంతరాలు ఉన్నాయని, జమిలి ఎన్నికలు 2029లో పెట్టడా నికి ఆస్కారం ఉందని తెలిపారు. 

బండి భగీరథ్ కేసులో చట్ట ప్రకారం చర్యలు..

బండి సంజయ్ కుమారుడి అంశంపైన డీజీపీ, ఇతర అధికారులతో సమీక్ష చేశామని సీఎం రేవంత్ తెలిపారు. ఆయన కుమారుడిపైన పేట్ బషీరాబాద్ స్టేషన్‌లో అమ్మా యి తల్లి ఫిర్యాదు చేశారని చెప్పారు. 8వ తేదీన సంజయ్ కుమారుడి పైన ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందని, అంతకుముందే కరీంనగర్‌లో బండి సంజయ్ కుమారుడు వాళ్ల పైన కేసు పెట్టారని పేర్కొన్నారు. 9, 10 తేదీ ల్లో ప్రధాని మోదీ పర్యటన వల్ల 10 వేల మంది పోలీసులు భద్రతలో నిమగ్నమయ్యారని, డీజీ నుంచి కిందస్థాయి అధికా రుల వరకు అంతా ఈ భద్రతలోనే ఉన్నారని చెప్పారు.

ఇప్పుడు విచారణ ప్రారంభ మైందని, పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. బీఆర్‌ఎస్ వాళ్లు కోరుకున్న ట్లు క్షణాల మీద జరగదని, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అన్న విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. సీనియర్ ఉమెన్ ఆఫీసర్‌ను విచారణాధికారిగా నియమించి, విచారణ చేయాలని డీజీపీని ఆదేశిం చామని తెలిపారు. బాధితులను కలిసి స్టేట్ మెంట్ తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసింది పోలీసులే.. ఈ విషయం ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు తెలియదా అని ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు.. ‘ఎవరినీ మేం ఇప్పటి వరకు వదిలిపెట్టలేదు’అని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేస్తుంది.. ఎవరికీ మినహాయింపులు లేవన్నారు. ఖాళీగా ఉన్నామని కేటీఆ ర్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డ్యూటీ చేస్తామంటే ఎలా? అన్నారు.

మైక్‌ల ముందు స్టేట్ మెంట్లు ఇచ్చే నాయకుల ఆధారంగా కేసుల విచారణ జరగదని సూచించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ కమిషనర్‌కు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. మోదీ సభకు 48 గంటల ముందే బండి భగీరథ్ పైన పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, బాలికకు సంబంధించిన అంశంలో అంతా బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. 

జూన్ 2న జర్నలిస్టులకు శుభవార్త..

ప్రభుత్వ స్కూల్స్ ఓపెనింగ్ రోజు పిల్లలతో యాంటీ డ్రగ్ ప్రమాణం కోసం గవర్న ర్‌ను ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పూర్తిస్థాయిలో చర్చ జరిగిన తర్వాతే ఇంటర్‌పైన తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తుమ్మడి హట్టి పైన ఇప్పటికే మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశామని, ఆయన స్పందించేలా చూడాలని ప్రధాని మోదీకి ‘నేను లేఖ రాశా’నని తెలిపారు.

రెండు రాష్ట్రా ల మధ్య సమస్య వచ్చినప్పుడు ప్రధాని పెద్దరికం వహిస్తే బాగుంటుందని, మహారాష్ట్ర సీఎంతో మాట్లాడాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కూడా కోరుతున్నామని చెప్పారు. ధా న్యం విపరీతంగా దిగుబడి వచ్చింది.. కొన్ని సమస్యలు ఉన్నాయి.. వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పంట మార్పిడిపైన విస్తృత చర్చ జరగాలని, క్షేత్రస్థాయి లో రైతులకు వివరిస్తామని చెప్పారు.

జూన్ 2 లోపు జర్నలిస్టుల ఇండ్ల విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటామని, ఈనెల 21న క్యాబినెట్‌లో చర్చిస్తామని స్పష్టం చేశా రు. జూన్ రెండో తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జర్నలిస్టులకు శుభవార్త చెబుతామన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావుతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.