దేశ చరిత్రలో చీకటి అధ్యాయం
ట్రంపునకు మోకరిల్లుతున్న ప్రధాని నరేంద్రమోదీ
సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 14 (విజయక్రాంతి): దేశ చరిత్రలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు చీకటి అధ్యాయమని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇష్టా రీతిగా దేశాల మీద దాడులు చేస్తూ విచక్షణా రహితంగా పసి పిల్లలను సైతం చంపుతుంటే భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ కనీసం నోరు మెదపకుండా ట్రంప్‌నకు మోకరిల్లినట్లు వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు.
పాల్వంచలో సీపీఐ తరఫున గెలి చిన మునిసిపాల్ కార్పొరేటర్లు, సర్పంచులు, ఉప సర్పంచుల రాష్ట్ర వ్యాప్త శిక్షణా తరగతుల రెండో రోజు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో ట్రంప్ ఆంక్షలు విధిస్తుంటే మోడి మౌనపాత్ర పోషించడం సరైంది కాదన్నారు. దీనిపై వామపక్ష లౌకిక శక్తులు ఐక్యమై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కమ్యూనిస్టు రాజకీయాల్లో కొత్తగూడెం నియోజకవర్గ విజయాలు ఆదర్శమని, ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలిచిన నాటి నుండి గ్రామ పంచాయితీ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయపరంపర కొనసాగిందన్నారు.
కొత్తగూడెం కార్పొరేషన్ నుండి గెలిచిన వారిలో 90 శాతం యువతరం ఉందని, ఇది శుభ పరిణామం అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, సర్పం సృజన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వశ్య పద్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, బేజవాడ వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు, కర్రి బిక్షవతి, అజయ్ సారధి, మూడ్ గణేష్ పాల్గొనగా మునిగడప పద్మ, ఉమా వాసిరెడ్డి మురళీ స్టీరింగ్ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు.




