మహిళలు మార్పునకు నాయకులు
ఉద్యోగార్థులు కాదు, ఉద్యోగ సృష్టికర్తలు..
షీ స్పార్క్ సదస్సులో మంత్రి సీతక్క
హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు మాత్రమే కాకుండా మార్పునకు నాయకులుగా నిలిచే భవిష్యత్తును కలిసి నిర్మిద్దామని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. బుల్లెట్ నుంచి బ్యాలెట్ వరకు సాగిన తన జీవిత ప్రయాణం ప్రజాస్వామ్య శక్తిని ప్రతిబింబిస్తుందని సీతక్క పేర్కొన్నారు. ఒకప్పుడు న్యాయస్థానంలో నిందితురాలిగా నిలిచిన తాను, కాలక్రమంలో అదే కోర్టులో న్యాయవాదిగా వాదనలు వినిపించిన సందర్భం తన జీవితంలో కీలక మలుపుగా నిలిచిందని గుర్తుచేశారు.
భారత రాజ్యాంగం కల్పించిన అవకాశాల వల్లే ఈ మార్పు సాధ్యమైందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ముందంజలో ఉన్న మహిళా నాయకులను ఒక వేదికపైకి తీసుకువచ్చిన ‘షీ స్పార్క్ కార్యక్రమంలో మంత్రి సీతక్క శనివారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సమాజంలో మార్పు తీసుకురావడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
తాను ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామానికి చెందిన ఆదివాసీ కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ప్రజాసేవలోకి వచ్చానని మంత్రి గుర్తుచేశారు. ఒకప్పుడు అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన తన జీవితం తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం పెరిగి ప్రధాన ప్రవాహంలోకి వచ్చానని తెలిపారు.
విద్య ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చని నమ్మి న్యాయ విద్యను అభ్యసించి న్యాయవాదిగా పనిచేశానని, అనంతరం ప్రజల సేవ కోసం ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ద్వారా రాష్ట్రంలో 46 లక్షలకుపైగా మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి సామాజిక-ఆర్థిక మార్పుకు దోహదపడుతున్నారని చెప్పారు.
మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు, చిన్న మధ్యతరహా వ్యాపారాలకు రుణాలు, మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ మహిళలను ఉద్యోగార్ధులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు బలపడతాయని, సమాజం అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క అన్నారు. గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు అవకాశాలు కల్పించేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమం నిర్వహించిన యువర్ స్టోరీ సంస్థ స్థాపకురాలు శ్రద్ధా శర్మ, నిర్వాహకులను మంత్రి సీతక్క అభినందించారు.




