calender_icon.png 10 December, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి...

10-12-2025 05:26:31 PM

డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేయాలి.. 

టీజిఎంఈయూ డిమాండ్..

హుజురాబాద్ (విజయక్రాంతి): ​​వైద్య విధాన పరిషత్(వీవీపీ)ను తక్షణమే రద్దు చేసి, దాని స్థానంలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్(టీజిఎంఈయూ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అంతేకాక, వీవీపీ ఉద్యోగులందరికీ ట్రెజరీ (010 హెడ్) ద్వారా వేతనాలను చెల్లించాలని యూనియన్ కోరింది. యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రి ఉద్యోగులు సామూహికంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించి వినతి పత్రాన్ని సూపరిండెంట్ నారాయణరెడ్డికి అందజేశారు. ​ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వాతి మాట్లాడుతూ... 1986లో ఏర్పాటైన వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించకపోవడం, వేతన సవరణ సంఘానికి (పీఆర్సీ) వినతులు సమర్పించే అవకాశం లేకపోవడం, ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించకపోవడం వంటి కారణాల వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్‌ను ఏర్పాటు చేశారని, అదే విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లను అధికారులకు తెలియజేయడానికి దశలవారీగా చేపట్టిన ఆందోళనలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైద్యశాలల ఉద్యోగులు ఈ రోజు సామూహికంగా సంతకాలను సేకరించి అధికారులకు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు సులోచన, సునీత, శోభ, జమున, జ్యోతి, స్నేహ, సుజాత, మమత ,శాంతి కల ఉద్యోగులు పాల్గొన్నారు.