10-12-2025 05:15:45 PM
* ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు
* పాపన్నపేటలో పోలీసు సిబ్బందికి ప్రత్యేక ఎన్నికల అవగాహన సమావేశం
పాపన్నపేట (విజయక్రాంతి): గురువారం జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పాక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పూర్తి స్థాయి భద్రతా ప్రణాళికను అమలు చేస్తున్నట్లు చెప్పారు. పాపన్నపేట పోలీస్ స్టేషన్‌లో పోలింగ్ బందోబస్తు, రూట్ మొబైల్, పోలింగ్ స్టేషన్ భద్రత, సెక్టార్ మొబైల్, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బందితో ఎస్పీ అవగాహన సమావేశం నిర్వహించారు. బాధ్యతలు, విధి విధానాలు, తక్షణ స్పందన చర్యలపై ఆయన స్పష్టమైన సూచనలు ఇచ్చారు. చిన్న వివాదాలు పెద్ద ఉద్రిక్తతలకు దారితీయకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు.
ప్రతి గ్రామం, ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అధికారులు, సిబ్బందంతా నిబద్ధతతో పనిచేసి ప్రశాంత ఎన్నికలకు కృషి చేయాలని సూచించారు. ఎన్నికల పర్యవేక్షణ అధికారులతో సమన్వయంగా వెంటనే స్పందించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఏ చిన్న ఉద్రిక్తతలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ప్రదర్శనలు, బాణసంచా పేల్చటం పూర్తిగా నిషేధమని ఎస్పీ హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శైలేందర్, సందీప్ రెడ్డి, ఎసై శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.