calender_icon.png 10 December, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టార్టప్‌లు యూనికార్న్‌ కంపెనీలుగా ఎదగాలి

10-12-2025 05:09:59 PM

హైదరాబాద్: స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో స్టార్టప్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని స్టార్టప్ కంపెనీలను ప్రారంభించడమే కాకుండా కనీసం 1 బిలియన్ డాలర్ల కంపెనీలుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. టి-హబ్ లో ఏర్పాటు చేసిన గూగుల్ స్టార్టప్‌లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న స్టార్టప్ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలన్న లక్ష్యంతో పని చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నుంచి కనీసం 100 స్టార్టప్‌లు యూనికార్న్‌ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తున్నా. అంటే కనీసం 1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీలు ఎదగాలన్నారు. వీటిల్లో 2034 నాటికి కనీసం 10 స్టార్టప్‌లు సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని, 1998లో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఇద్దరు మిత్రులు కలిసి కారిఫోర్నియాలో స్టార్టప్‌గా ప్రారంభించిన ఒక గ్యారేజీయే ఇప్పుడు గూగుల్‌గా అవతరించింది. ఇదెంతో స్ఫూర్తి దాయకమైన అంశమన్నారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక విజన్‌తో ముందుకు సాగుతూ, ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలన్న లక్ష్యంతో రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌పైన గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించామని, జాతీయ అంతర్జాతీయ కార్పోరేట్ ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రైజింగ్ విజన్‌ను ఆవిష్కరించామని సీఎం పేర్కొన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ రాష్ట్రం ఎదగాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నాం.

పదిహేను ఇరవై ఏళ్ల కిందట ప్రారంభించబడిన అనేక స్టార్టప్‌లు ఇప్పుడు బిలియన్స్ డాలర్ల కంపెనీలుగా ఎదిగాయి. గూగుల్, ఆపిల్, అమెజాన్, టెస్లా, మెటా వంటి ఎన్నో ఉదాహరణలు మనముందున్నాయి. గడిచిన 25 ఏళ్లుగా సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్‌లో ప్రారంభమైన చాలా స్టార్టప్‌లు పెద్ద పెద్ద కంపెనీలుగా ఎదిగాయన్నారు.

తెలంగాణ రైజింగ్ విజన్‌లో స్టార్టప్‌లకు సంబంధించి మీ ప్రణాళిక ఏమని అడిగినప్పుడు.. స్టార్టప్‌లను నేను ఫుట్‌బాల్ క్రీడతో పోల్చుతా. ఎందుకంటే నేను ఫుట్ బాల్ ఆడుతాను. ఫుట్‌బాల్‌లో సమిష్టి కృషి అవసరం. పట్టుదలతో సాధన చేయాలి. టీమ్ వర్క్‌తో పనిచేయాలి. చివరగా విజయం సాధించడం చాలా ముఖ్యం. స్టార్టప్‌లు కూడా అదే విధంగా పనిచేయాలి. హైదరాబాద్ ప్రస్తుతం వస్తు ఉత్పత్తి ఆధారిత స్టార్టప్‌లు, ఇన్నొవేటివ్ స్టార్టప్‌లు, ఐపీ ఇంటెన్సివ్ స్టార్టప్‌లపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ కేవలం స్టార్టప్స్ మాత్రమే కాకుండా యునికార్న్ కంపెనీల హబ్‌గా ఎదగాలన్నది నా ఆకాంక్ష.

2034 నాటికి వాటిల్లో కనీసం 10 సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలి. రాష్ట్రంలో అందుకోసం అవసరమైన ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేస్తాం. స్టార్టప్‌లకు అవసరమైన సహకారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ కలిసి పనిచేయబోతున్నాయి. స్టార్టప్ కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లతో స్టార్టప్ నిధిని ఏర్పాటు చేస్తాం. ఆ నిధిని వినియోగించుకుని తద్వారా భవిష్యత్తులో స్టార్టప్‌లు గూగుల్ స్థాయిలో లేదా కనీసం 1 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని ఆశిస్తున్నాం.." అని ఉద్ఘాటించారు.