10-12-2025 05:13:02 PM
మట్టిపల్లి సైదులు
మోతే (విజయక్రాంతి): ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మూడవ వార్డు సిపిఎం అభ్యర్థి కిన్నెర పోతయ్యను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సమాగ్రాభివృద్ధి లక్ష్యంగా సిపిఎం ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. డబ్బు, మద్యం ప్రభావానికి ప్రజలు గురి కాకుండా నిత్యం ప్రజా సంస్థల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న సిపిఎం అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలన్నారు.
కిన్నెర పోతయ్య గత 20 సంవత్సరాలుగా సిపిఎం పార్టీలో వివిధ హోదాలలో పనిచేస్తూ రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారని గుర్తు చేశారు. అవినీతి లేని పరిపాలన జరగాలంటే అది కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ మూడవ వార్డు అభ్యర్థి కిన్నెర పోతయ్య గ్యాస్ పొయ్యి గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి బూడిద లింగయ్య, మూడవ వార్డు అభ్యర్థి కిన్నెర పోతయ్య, నాయకులు సామ రామ్ రెడ్డి, బూడిద మల్లయ్య, బుర్రాజు పద్మ, తాళ్ల పెళ్లి సత్యనారాయణ, మట్టి పెళ్లి కాశీం పాల్గొన్నారు.