తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తుదారుల వెల్లువ..
భూభారతి దరఖాస్తులతో ప్రజలు..
వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం(Tahsildar office) సోమవారం ప్రజలతో నిండిపోయింది. భూభారతి చట్టంలో భాగంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించింది. దీనిలో భాగంగా మండలంలోని కొన్ని పంచాయతీల్లో దరఖాస్తులను తీసుకునేందుకు ప్రత్యేక తేదీలను అధికారులు ముందుగానే ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేని వారికోసం సోమవారం ప్రత్యేకంగా తహసిల్దార్ కార్యాలయంలో కౌంటర్లను ఏర్పాటు చేశారు. భూభారతిలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో తాసిల్దార్ కార్యాలయం సోమవారం ప్రజలతో కిక్కిరిసిపోయింది.
గతంలో మండలంలోని వివిధ పంచాయతీల్లో భూభారతి సమావేశాల్లో తమ పేర్లు నమోదు కాని వారు అంతా మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులు సమర్పించు కోవచ్చని జిల్లా అధికారులు ప్రకటించడంతో తాసిల్దార్ కార్యాలయం సందడిగా మారింది. భూభారతి లో తమ దరఖాస్తులు చేసుకునేందుకు ప్రజలు తాసిల్దార్ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. దీంతో నిత్యం కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.






