16 April, 2026 | 3:27 AM

ప్రజాస్వామ్యంలో చారిత్రాత్మక ఘట్టం

16-04-2026 01:59 AM

మహిళా రిజర్వేషన్లపై డాక్టర్ పద్మ వీరపనేని హర్షం

జూబ్లీహిల్స్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 16, 2026 ఒక ఆనందకరమైన.. చిరస్మరణీయమైన రోజుగా నిలుస్తుందని బీజేపీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు, తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి డాక్టర్ పద్మ వీరపనేని పేర్కొన్నారు. ఈ విషయమై ఆమె బుధవారం మాట్లాడుతూ దశాబ్దాల కల అయిన మహిళా రిజర్వేషన్ల అమలుకు బాటలు వేసే నారీ శక్తి వందన్ అధినియం సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ముందుకు గురువారం రానుండటం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 2029 నుంచే అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, దేశంలో స్త్రీ-పురుష సమానత్వం సాధించే దిశగా ఒక గొప్ప ముందడుగు అని ఆమె కొనియాడారు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అనే భారతీయ ధర్మానికి నిదర్శనంగా ఈ బిల్లు నిలుస్తుందని వ్యాఖ్యా నించారు.

ప్రపంచంలో మరే దేశం లో లేని విధంగా చట్టసభల్లో మహిళలకు మూడోవంతు సీట్లు కేటాయించడం ప్రతి భారతీ యుడు గర్వించదగ్గ విషయమని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, నూతన రాజకీయ పంథాకు నాంది పలికిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దేశ మహిళల తరపున ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.