21-08-2025 06:51:15 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మల్యాలలోనే హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) విజ్ఞప్తి చేశారు. గురువారం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందజేశారు. హార్టికల్చర్ యూనివర్సిటీ కెవికె మల్యాలలో ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలము, ఇతర మౌలిక వసతులు ఉన్నాయని, మరోచోటికి మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. దీనికి స్పందించిన వేం నరేందర్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో మాట్లాడి మల్యాలలోనే హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తమ విజ్ఞప్తిని పరిశీలించి వెంటనే ఆదేశాలు జారీ చేసినందుకు వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.