విజయసాయిరెడ్డికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): వృత్తిపరమైన దుష్ప్రవర్తన వ్యవహారంలో విజయసాయిరెడ్డికి ఇచ్చిన నోటీసులను రద్దు చేస్తూ సింగి ల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) దాఖలు చేసిన అప్పీల్‌పై ఎంపీ వీ విజయసాయిరెడ్డికి, కేంద్ర ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది.
రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. విజయసాయిరెడ్డి వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఐసీఏఐ కమిటీ తీసుకున్న ప్రాథమిక నిర్ణయాన్ని రద్దు చేయడంతోపాటు నోటీసులను సింగిల్ జడ్జి రద్దు చేయడం సరికాదంటూ ఐసీఐఏఐ దాఖలు చేసిన అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
ఐసీఏఐ తరఫు సీనియర్ న్యాయవాది ఎంఎస్‌ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. తాము లేవనెత్తిన ప్రాథమిక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. విజయసాయిరెడ్డి పిటిషన్‌పై విచారించే పరిధి ఈ కోర్టుకు లేదని పేర్కొన్నామని చెప్పారు. కమిటీ ప్రాథమిక అభిప్రాయాన్ని సింగిల్ జడ్జి కొట్టివేయడం సరికాదని, ఈ దశలో న్యాయసమీక్షకు అవకాశం లేదని తెలిపారు.
విజయసాయిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది వెంకటేశ్ వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేసిన పక్షంలో తమ పిటిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. దీనిపై కౌంటరు దాఖలు చేస్తామని గడువు కావాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం ఐసీఏఐ అప్పీల్‌ను విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులైన విజయసాయిరెడ్డి, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.






