నకిలీ వైద్యం!
మనకు తల్లిదండ్రులు జన్మనిస్తారు. వైద్యులు పునర్జన్మను ప్రసాదిస్తారు. అందుకే ‘వైద్యో నారాయణో హరిః’ అన్నారు పెద్దలు. అంటే వైద్యులు దేవుళ్లతో సమానమని దానర్థం. కానీ, కొంతమంది అక్రమార్జన కోసం ఎంతో పవిత్రమైన వైద్య వృత్తికి మకిలీ అంటిస్తున్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల పెద్ద సంఖ్యలో నకిలీ వైద్యులు పట్టుబడటమే అందుకు ప్రత్యక్ష తార్కాణం. వైద్య విద్యార్హతలు లేకపోయినా, ప్రాథమిక చికిత్సపై కనీస అవగాహన లేకపోయినా క్లినిక్‌లు, ఆసుపత్రులను నడుపుతూ కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
వైద్య పరిజ్ఞానం లేని వీరు రోగనిర్ధారణ పరీక్షలకు సిఫారసు చేయడం, వ్యాధులను నిర్ధారించడం, గడువు ముగిసిన ఔషధాలను అంటగట్టడం మరింత కలవరపెడుతున్నది. నకిలీ వైద్యుల దందాకు కనీస ప్రమాణాలు లేని ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్‌లు తోడవుతున్నాయి. ఈ పరిణామాలు తెలంగాణలో పెరుగుతున్న వైద్య అవసరాల డిమాండ్‌ను తెలియజేస్తున్నది.
రాష్ట్రంలో వైద్య సేవలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ వైద్య వ్యవస్థ మాత్రం బలోపేతం కావడం లేదు. వైద్యులు, సిబ్బంది, పరికరాలు, ఔషధాలు, ఇతర మౌలిక సదుపాయాల కొరతతో కునారిల్లుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. మరోవైపు ప్రైవేటు, ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రుల వైపు సామాన్యులు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు.
ఈ నేపథ్యంలోనే పేదలు తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుందనే ఆశతో బస్తీలలోని క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల అవసరాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న కొందరు నకిలీ వైద్యుల అవతారమెత్తుతున్నారు. కాగా, ఇప్పటికే వ్యాపారంగా మారిపోయిన విద్య పేదలకు అందనంత ఎత్తుకు చేరుకున్నది. ఒక సేవగా అందాల్సిన వైద్యం కూడా విద్య సరసన చేరుతుండటం ఆందోళనకరం. వైద్యం లాభార్జనకు మార్గంగా మారితే ముందుగా నష్టపోయేది సామాన్యుడే.
అందువల్ల నకిలీ వైద్యులతోపాటు అనుమతి లేని క్లినిక్‌లు, ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లపైనా గట్టి నిఘా పెట్టాలి. అదే సమయంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలి. కొందరి స్వార్థానికి అమాయక ప్రజల ఆరోగ్యం బలికాకూడదు. ఇప్పటికైనా వైద్యమంటే ఫక్తు వ్యాపారం కాదు, ఒక సేవ అనే కఠిన వాస్తవాన్ని ప్రభుత్వంతోపాటు వైద్యులూ గుర్తించాలి.






