నేరాలకు కేరాఫ్ ఘోస్ట్ సిమ్
ఒకప్పుడు నేరానికి ప్రత్యక్షంగా వ్యక్తి లేదా వస్తువు అవసరమయ్యేది. ఇప్పుడు ఒక నకిలీ గుర్తింపు, ఒక మొబైల్ కనెక్షన్, ఒక డిజిటల్ పరికరం చాలు! ఈ నేపథ్యంలో ‘ఘోస్ట్ సిమ్’ అనే పదం సైబర్ భద్రతలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇతరుల పేర్లతో, నకిలీ లేదా దుర్వినియోగమైన గుర్తింపు వివరాలతో, లేదా వినియోగదారుడి అనుమతి లేకుండా అదనంగా యాక్టివేట్ చేసిన ఘోస్ట్ సిమ్‌లు సైబర్ నేరగాళ్లకు అజ్ఞాత కవచంగా మారుతున్నాయి.
సైబర్ నేరగాళ్లకు ఘోస్ట్ సిమ్ ఒక రకమైన డిజిటల్ ముసుగు. దాని ద్వారా మోసపూరిత కాల్స్, సందేశాలు, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన కమ్యూనికేషన్ సాగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి పేరుతో తనకు తెలియకుండానే అదనపు సిమ్ యాక్టివేట్ అయితే, ఆ నంబర్ ద్వారా జరిగే కార్యకలాపాలపై ఆ వ్యక్తిపైనే మొదట అనుమానం వస్తుంది.
ఆర్థిక మోసాలు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం, నకిలీ గుర్తింపులు, బెదిరింపులు వంటి నేరాలకు అక్రమంగా పొందిన మొబైల్ కనెక్షన్లు ఉపయోగపడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ ఈ ముప్పు తీవ్రతను స్పష్టంగా చూపించింది. 13 రాష్ట్రాల్లో ఏడు రోజులపాటు 18 ప్రత్యేక బృందాలతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో 66 మందిని అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం 1,194 ఘోస్ట్ సిమ్‌లు వివిధ సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో 544 సిమ్లను స్వాధీనం చేసుకోగా, వాటిలో 432 సిమ్‌లు ఇంకా నేర కార్యకలాపాలకు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నవిగా గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి 76 సైబర్ నేర కేసుల్లో సుమారు రూ.101.87 కోట్ల మోసం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో 44 మంది ఘోస్ట్ సిమ్ హోల్డర్లు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు, ఇద్దరు సరఫరాదారులు ఉన్నారు.
ఈ గణాంకాలు ఒక విషయం చెబుతున్నాయి. సైబర్ నేరాన్ని కేవలం కంప్యూటర్ సమస్యగా చూడటం ఇక సాధ్యం కాదు. టెలికం భద్రతే సైబర్ భద్రతకు మొదటి గుమ్మంగా మారింది. ఈ నేపథ్యంలో ‘నా పేరుతో నా దగ్గరున్న నంబర్ ఒక్కటే ఉంది’ అని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. మన పేర్లపై ఉన్న మొబైల్ కనెక్షన్లను ‘సంచార్ సాథీ’ పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. ఇందులో మన పేరుతో నమోదైన మొబైల్ కనెక్షన్లను పరిశీలించి, మనకు తెలియని కనెక్షన్ ఉంటే దానిపై చర్య కోరవచ్చు.
అదే సమయంలో సిమ్ విక్రయ కేంద్రాల వద్ద కస్టమర్ వివరాల రక్షణ అత్యంత కీలకం. నిజమైన వినియోగదారుడి ఈథూ సమాచారాన్ని దుర్వినియోగం చేసి అదనపు సిమ్‌లు యాక్టివేట్ చేయడం వంటి ఆరోపణలు హైదరాబాద్ ఆపరేషన్‌లో బయటపడ్డాయి. అందువల్ల టెలికం సంస్థలు, పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు, నియంత్రణ సంస్థలు కలిసి రియల్‌టైమ్ ధ్రువీకరణతో పాటు అనుమానాస్పద కనెక్షన్ల డీయాక్టివేషన్‌కు చర్యలు చేపట్టాలి.
నకిలీ గుర్తింపుతో సిమ్ పొందడం టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023లోని సెక్షన్ 42(3)(ఈ) ప్రకారం నేరం. సెక్షన్ 42(3) కింద గరిష్ఠంగా మూడేళ్ల జైలు లేదా రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉం ది. అయితే, చట్టం మాత్రమే సరిపోదు. టెక్నాలజీతో చేసే నేరాలను టెక్నాలజీతోనే ఎదుర్కోవాలి. ఒకే వ్యక్తి వివరాలతో అసాధారణ సంఖ్యలో సిమ్‌లు యాక్టివేట్ అయితే వెంటనే గుర్తించే ఏఐ ఆధారిత వ్యవస్థలు ఉండాలి.
ఒకే ప్రాంతం లేదా ఒకే ఏజెంట్ నుంచి భారీగా కనెక్షన్లు జారీ అయితే ఆటోమేటిక్‌గా అలర్ట్ రావాలి. అనుమానాస్పద సిమ్ సైబర్ నేరంలో ఉపయోగించినట్లు గుర్తించిన వెంటనే దేశవ్యాప్తంగా సంబంధిత వ్యవస్థలకు సమాచారం చేరేలా సమన్వయ వ్యవస్థ అవసరం. టెలికం సంస్థలు, పోలీసులు, బ్యాంకులు, సైబర్ నేర దర్యాప్తు సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు పరస్పరం సమాచారాన్ని పంచుకునే వ్యవస్థ మరింత బలపడాలి. అంతకంటే ముఖ్యంగా డిజిటల్ యుగంలో అప్రమత్తతే తొలి రక్షణ కవచమని అందరూ గుర్తించాలి.
వ్యాసకర్త: సామాజిక విశ్లేషకులు, 9573666650






