19-01-2026 12:00:00 AM
మణుగూరు, జనవరి18 (విజయక్రాంతి) : సిపిఐ పార్టీ అవతరించి శత వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నేడు ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిల భారత స్థాయి బహిరంగ సభకు ఆదివారం మండలం నుంచి సీపీఐ కార్యకర్తలు, నాయకులు, ప్రజాసంఘాల బాధ్యులు భారీ సంఖ్యలో సుమారు 30 బస్సులు ,15 కార్లు, ట్రాలీలతో ఖమ్మం బయలుదేరారు. పార్టీ జెండాలు, నినాదాలతో ఉత్సాహంగా ఖమ్మం వైపు తరలిన కార్యకర్తలు సీపీఐ శతాబ్ది వేడుకలను విజయవంతం చేయాలనే సంకల్పంతో తరలి వెళ్లారు.
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లరెడ్డి, పట్టణ సీపీఐ కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ, దేశంలో కార్మికులు, రైతులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఐ ఆవిర్భావం నుంచి నిరంతర పోరాటం చేస్తోందని తెలిపారు. కార్మిక హక్కులు, భూసమస్యలు, రైతాంగానికి న్యాయం, సామాజిక సమానత్వం కోసం సీపీఐ చారిత్రక ఉద్యమాలు నిర్వహించిందని గుర్తు చేశారు.
ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ సిపిఐ శతాబ్ది ఉద్యమాల్లో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని, ఈ సభ ద్వారా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటాలకు దిశా నిర్దేశం జరుగుతుందని వారు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతి రేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయడమే ఈ సభ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల నాయకులు, గ్రామ శాఖల కార్యదర్శులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.