19-01-2026 12:00:00 AM
ఏడీఏ రవికుమార్
ములకలపల్లి, జనవరి 18 (విజయక్రాంతి): రెవెన్యూ పట్టాదార్ పాస్ పుస్తకం కలిగిన మండలంలోని రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కొత్తగూడెం వ్యవసాయ శాఖ ఏడిఏ రవికుమార్ సూచించారు.మండల వ్యవసాయ అధికారి బి అరుణ్ బాబుతో కలిసి ఆదివారం మండలంలోని రైతు వేదికలను స్థానిక సహకార సొసైటీ కార్యాలయాన్ని సందర్శించి ఫార్మా రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించారు.
రైతులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధి పొందడానికి, పీఎం కిసాన్ లబ్ధి పొందడానికి ఫార్మర్ ఐడి తప్పనిసరి గా ఉండాలని తెలిపారు. దీనివలన రైతు వివరాలు కచ్చితంగా నమోదు అయి పారదర్శకత పెరుగుతుందని బీమా, సబ్సిడీలు, రుణాలు, ప్రభుత్వ పధకాలు త్వరగా పొందుతారని భవిష్యత్తులో పథకాల ప్రయోజనాలు పొందడం సులభం అవుతుందని, ఐడితో నేరుగా నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని, స్పష్టమైన గుర్తింపుతో మోసాలు తగ్గించవచ్చని రైతులకు సూచించారు.
ఆధార్ కార్డు నెంబర్, భూమి పాసుబుక్ వివరాలు, ఆధార్‌కు లింకు అయిన మొబైల్ నెంబరుతో మీసేవ కేంద్రంలో కేవలం రూ.15/- చెల్లించి నమోదు చేసుకునే అవకాశం ఉందని, లేదా దగ్గరలోని రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.రైతులందరూ త్వరపడి మీ దగ్గరలోని మీసేవ కేంద్రంలో గాని లేదా వ్యవసాయ విస్తరణ అధికారుల దగ్గర గాని ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా రైతులను కోరారు.