8 May, 2026 | 7:31 AM

అలుపెరుగని పోరాటం

20-05-2024 12:05 AM

కొత్త పుస్తకం :

‘ఉపా’ చట్టం కింద కిందటేడాది (2023) అక్టోబర్‌లో అరెస్టు అయి, ఇటీవలె సుప్రీంకోర్టు ఆదేశంతో విడుదలైన ‘న్యూస్ క్లిక్’ పోర్టల్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ ఆత్మకథ ఇది. 74 సంవత్సరాల ఈ వృద్ధ జర్నలిస్ట్ తన నిజ జీవిత సంఘటనలకు ఆంగ్లంలో అక్షర రూపమివ్వగా, బోడపట్ల రవీందర్ తెలుగులోకి అనువదించారు. సుమారు 49 సంవత్సరాల క్రితం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడుగా పోలీసు లతో అరెస్ట్ అయిన దగ్గర్నుంచి నేటి వరకు ఆయనది నిజంగానే సుదీర్ఘ పోరాటమే.

ఆనాడు యూనివర్సిటీలో జరిగిన ఒక సమ్మెలో పాల్గొన్నాడన్న కారణంతో తనను అరెస్టు చేశారు. కిందటేడాది న్యూస్ క్లిక్’ పోర్టల్‌కు విదేశీ (చైనా) నిధులు అందుతున్నాయన్న ఆరోపణ మోపారు. కానీ, వాటికి తగిన సాక్ష్యాధారాలను పోలీసులు సమర్పించలేక పోవడంతో సుప్రీంకోర్టు తక్షణం తనను విడుదల చేయవలసిందిగా ఆదేశించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్నించి నేటివరకు సాగిన ఆయన జీవితం ఒక రకంగా నిజంగా అలుపెరుగని పోరాటమే.

సెప్టెంబర్ 25. 1975. 

న్యూఢిల్లీ, జవహర్‌లాల్  నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎన్నికైన విద్యార్థి యూనియన్ కౌన్సిలర్ అశోక్ లతా జైన్ బర్తరఫ్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు సమ్మె చేస్తున్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి అప్పటికి మూడు మాసాలయింది. అది సమ్మె రెండవ రోజు, విశ్వవిద్యాలయం అంతా ఉద్రిక్తంగా ఉంది. ఓ విద్యార్థి బృందం ఉన్నదగ్గరికి ఓ ఎంబాసిడర్ కారు వచ్చి ఆగింది. దానిలో -నుండి మఫ్టీలో ఉన్న కొందరు పోలీసులు దిగారు. దిగడం దిగడం విద్యార్థులలో ఒకరిన పట్టేసుకుని లాక్కెళ్లి పోయారు. ఆ విద్యార్థి ఏడాదిపాటు జైల్లో గడపాల్సి వచ్చింది.

ఫిబ్రవరి 8, 2021. 

ఓ ఆన్‌లైన్ వార్తా సంస్థను నిర్వహిస్తున్న వ్యవస్థాపకుని ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడి చేశారు. ఆ దాడి 113 గంటలు, ఐదు రోజులకు పైగా కొనసాగింది. ఆ వార్తా సంస్థ కార్యాలయంపై కూడా దాడి జరిగింది.

అక్టోబరు 3, 2023.

ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌కు చెందిన అధికారులు ఆ వార్తా సంస్థ వ్యవస్థాపకుడిని, అతని సహచరుడిని భయంకరమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అరెస్టు చేశారు.

ఈ ’అలుపెరుగని పోరాటం’ ఏభై ఏళ్ళ వ్యవధిలో రెండు నిరంకుశ ప్రభుత్వాల చేత వేధింపుకు గురయిన ప్రబీర్ పుర్కాయస్థ జ్ఞాపకాలు. ఓ యువకుడు రాజకీయాల్లో పరిణతి చెందిన పరిణామ క్రమం కూడ. ఈ కథనం ఎంతో హాస్యచతురతతో కొనసాగుతుంది. కొన్ని ప్రధానమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యలను ఇన్ని దశాబ్దాల కాలంలో ఆయన ఎదుర్కొన్న తీరును ఇది వివరిస్తుంది.

 రోమిలా థాపర్