18-01-2026 12:00:00 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల మాంత్రికుడిలా వ్యవహరిస్తున్నారు. అధ్యక్షుడిగా రెండోసారి పీఠమెక్కిననాటి నుంచి ట్రంప్ నోటికి అడ్డూ అదుపు ఉండడం లేదు. ఎవరేం చెప్పినా విననంటూ మొండికేస్తున్న ట్రంప్ తన మాటే నెగ్గాలన్న పంతంతో ముందుకు సాగుతున్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ భారత్, పాకిస్థాన్ యుద్ధం విషయంలో మరోసారి పాతపాటే పాడారు. భారత్, పాక్ యుద్ధాన్ని ఆపడం వల్ల కోటి మంది ప్రాణాలను కాపాడగలిగానని, అందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ తనకు కృతజ్ఞతలు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. ‘సదరన్ బౌలేవార్డ్’ పేరును ‘డొనాల్డ్ జె ట్రంప్ బౌలేవార్డ్’గా మార్చిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ చెప్పడం ఇది 80వ సారి. గతేడాది మే 10న భారత్, పాక్ మధ్య యుద్ధం నిలిచిపోయిన సమయం నాటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ అవకాశమొచ్చినా తానొక శాంతికాముకుడినంటూ ట్రంప్ పదే పదే ప్రకటించుకున్నారు. మరోవైపు భారత్ మాత్రం పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో మూడో పక్షం జోక్యం లేదని, పాక్ కాళ్ల బేరానికి రావడంతోనే యుద్ధం ముగిసిందని ఖండిస్తూనే వచ్చింది. అంతేకాదు భారత్‌తో వాణిజ్య ఒప్పందం విషయంలోనూ ట్రంప్ రెండు నాల్కల ధోరణి ప్రదర్శించారు. ‘మోదీ నా పట్ల సంతోషంగా లేరంటూ’ ఒకసారి.. ‘మోదీ పట్ల నేను సంతోషంగా లేనంటూ’ మరోసారి ఎవరికీ అర్థంకాని రీతిలో వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో 8 యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాలేదంటూ విచారం వ్యక్తం చేసిన ట్రంప్ మొత్తానికి ఎలాగోలా నోబెల్ పురస్కా రాన్ని తన దగ్గరికి రప్పించుకున్నారు. శాంతి బహుమతిని ఎగరేసుకుపోయిన వెనిజులా విపక్ష నేత మరియా కొరీనా మచాడో చేతనే ఈ అవార్డుకు ‘ట్రంప్ అర్హుడంటూ’ చెప్పించుకున్నారు. తనకొచ్చిన నోబెల్‌ను ట్రంప్‌కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన మచాడో.. అన్న మాట ప్రకారం ఈ గురువారం ట్రంప్ దగ్గరకు వెళ్లి శాంతి బహుమతిని అందించింది. ఒకపక్క నోబెల్ కమిటీ ఇది చెల్లదని పేర్కొన్నప్పటికీ పట్టించుకోని ట్రంప్ ఆనందంగా అవార్డును స్వీకరించారు.
మరోపక్క చమురు, సహజ వాయువు, అరుదైన ఖనిజాల నిక్షేపాల కోసం రష్యా, చైనాలపై ఆధారపడకూడదన్న ఉద్దేశంతో పొరుగున ఉన్న లాటిన్ అమెరికా దేశాలపై కన్నేసిన ట్రంప్ వాటిని సొంతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వెనిజులా, గ్రీన్‌లాండ్‌లను హస్తగతం చేసుకున్న ట్రంప్ గురి ఇప్పుడు మెక్సికోపై పడినట్లుంది. అమెరికాకు పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు తరలిస్తున్న మెక్సికో పద్దతి మార్చుకోకపోతే వెనిజులా పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మెక్సికో సహా ఇతర ప్రాంతాల మీదుగా విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని అమెరికా విమానయాన సంస్థలకు ఆ దేశ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం.
ఇరాన్‌లో ఖమేనీ పాలనపై దేశ ప్రజల్లో పెల్లుబికిన నిరసనలను తనకు అనుకూలంగా మార్చుకున్న ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి దాదాపు యుద్ధానికి సిద్ధమయ్యారు. కానీ గల్ఫ్‌లోని మిత్ర దేశాల చొరవతో ఇరాన్‌తో యుద్ధాన్ని విరమించుకున్న ట్రంప్ ఇప్పుడు దానిని మెక్సికోవైపు తిప్పారు. రెండోదఫా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాకా ట్రంప్ తన ఒంటెద్దు పోకడ నిర్ణయాలతో అందరికీ విసుగు తెప్పిస్తున్నారు.