మల్లూరు ఆలయ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి
* భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి * జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
మంగపేట, మార్చి 26 ( విజయక్రాంతి): మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ వెంటనే సిద్ధం చేయాలని, స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ సందర్శించి అభివృద్ధి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి దర్శనం కోసం అనేక మంది భక్తులు వస్తుంటారని, వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల వసతులు సౌలభ్యాలు ఆలయ అభివృద్ధి పై వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రధాన ఆర్చి నిర్మాణం, రోడ్డు విస్తరణ, కళ్యాణ కట్ట, కళ్యాణ మండపం, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, ఇతర ఆలయ అభివృద్ధి పనులపై త్వరితగతిన నివేదికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఆచార సాప్రదాయాలకు ఆటంకం కలగకుండా ఆలయ అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్కిటెక్ బృందం, దేవాదాయ శాఖ డిఈ రమేష్ బాబు, తాసిల్దార్ తోట రవీందర్, ఆలయ ఈవో మహేష్, ఎంపీడీవో బద్రు నాయక్, ఆలయ అర్చకులు, సంబంధిత అధికారులు, దేవస్థానం మాజీ చైర్మన్లు ఎర్రంకాని సురేష్. పూజారి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.




