ఖమ్మం అభివృద్ధికి ప్రణాళిక
* వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
* రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభం
ఖమ్మం, డిసెంబర్ 7 (విజయక్రాంతి): ఖమ్మం నగరాభివృద్ధికి ప్రణాళికబద్ధంగా కార్యాచరణ చేపడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎంతోకాలంగా ఖమ్మం నగర ప్రజలు, సారధీనగర్ మామిళ్లగూడెం ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న సారధీనగర్ రైల్వే అండర్ బ్రిడ్జిని శనివారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. దీని ఆధునీకరణకు రూ.190 లక్షలు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రైల్వే అధికారులను కలిసి రైల్వే అండర్ బ్రిడ్జి మంజూరు చేయించినట్టు తెలిపారు.
గత సంవత్సరం పనులు చేపట్టి, సంవత్సరకాలంలోనే పూర్తి చేసుకుని వినియోగంలోకి తెచ్చుకున్నామని తెలిపారు. వెలుగమట్ల పార్క్ సందర్శన స్థలంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఖమ్మం పట్ణణీకరణ బాగా జరుగుతుందని, భవిష్యత్ తరాలకు అవసరాలు తీర్చేలా మాస్టర్ ప్లాన్ చేపట్టాలన్నారు. మురికి కూపంగా ఉన్న ఖమ్మం ఇప్పుడిప్పుడే తేరుకుంటుందని, అభివృద్ధికి ప్రజల సహకారం కావాలన్నారు.
నాలాలు, అలుగులు పూడ్చామని, అన్నిటిపై కట్టడాలు కట్టి, నీరు పోకుండా చేసినందునే ఇండ్లలోకి నీరు వచ్చిందన్నారు.
రోడ్లపై ఆలయాలు కట్టొద్దు..
చర్చిలు, మసీదులు, దేవాలయాలు రోడ్ల పై ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పినా ఎవ రూ వినడం లేదని, ఫలితంగా అందరు ఇబ్బందిపడాల్సి వస్తున్నదని మంత్రి తుమ్మ ల అన్నారు. మొదట్లోనే సంబంధిత అధికారులు స్పందించి అటువంటి నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి నిర్మాణాల విషయంలో ఇటు ప్రజలు, అటు నాయకులు, అధికారులు మాట్లాడటం లేదని, భవిష్యత్ తరం ఇబ్బంది పడే పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కమిషనర్ అభిషేక్ ఆగస్త్య పాల్గొన్నారు.




