26-07-2025 11:07:40 PM
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్..
సూర్యాపేట (విజయక్రాంతి): విద్యార్థుల ఆలోచనలు మెరుగ్గా ఉండేందుకు పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar) అన్నారు. జిల్లాలోని ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలో గల జెడ్.పి.హెచ్.ఎస్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ, తహసీల్దార్ కార్యాలయం, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ను సందర్శించి అక్కడ వేసిన రంగులు, గోడలపై చిత్రాలు, పాఠశాల పర్యావరణాన్ని పరిశీలించి అభినందించారు. అలాగే ప్రాథమిక పాఠశాలకు వెళ్లి 5వ తరగతి విద్యార్థులతో ఇంగ్లీష్ పాఠాన్ని చదివించారు. విద్యార్థుల నోట్స్ కూడా పరిశీలించి మెచ్చుకున్నారు. వారికి నోటుబుక్స్, పెన్నులు అందజేశారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. శరీర భాగాలు బొమ్మ చూపెట్టి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.
తదుపరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సందర్శించి వంట గదిలోని టమాట, ఇతర కూరగాయలు పరిశీలించి టమాట బాగాలేకేపోవటం తో వెనక్కి పంపించారు. నాణ్యమైన కూరగాయలు వాడాలని సూచించారు. పలు విషయాలను పాఠశాల ఎస్ ఓ ని అడిగి తెలుసుకున్నారు. భూ భారతి రెవిన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన ఆర్జీలపై అధికారులతో తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మండలంలో మొత్తం 3983 అర్జీలను స్వీకరించామని, 1810 ఆర్జిదారులకి నోటీసులు ఇవ్వటం జరిగిందని కలెక్టర్ కి తహసీల్దార్ వివరించారు. వన మహోత్సవంలో భాగంగా తుమ్మల పెన్ పహాడ్ క్రాస్ రోడ్ నందు అవెన్యూ ప్లాంటేషన్ లో పాల్గొని కలెక్టర్ మొక్క నాటారు. రైతులకు, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ నాయక్,తహసీల్దార్ అమీన్ సింగ్, ఎంపిడిఓ మహమ్మద్ హసీం, ఎం.ఈ.ఓ ధారసింగ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.